ఆర్‌సీబీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌!

2025లో టైటిల్ గెలిచిన తర్వాత వేడుకల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడంతో పండుగ వాతావరణం కాస్త విషాదంగా మారింది.

Published By: HashtagU Telugu Desk
IPL 2026 Matches

IPL 2026 Matches

IPL 2026 Matches: ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు ఒక భారీ శుభవార్త అందింది. ఈ జట్టు తన హోమ్ మ్యాచ్‌లను షెడ్యూల్ ప్రకారమే ఆడుతూ కనిపిస్తుంది. ఇంతకుముందు వరకు ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్‌ల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. కానీ ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం నుండి KSCAకు దీనికి సంబంధించిన అనుమతి లభించింది.

Also Read: అమరావతిలో అమర జీవికి అద్భుత నివాళి….!!

2025లో టైటిల్ గెలిచిన తర్వాత వేడుకల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడంతో పండుగ వాతావరణం కాస్త విషాదంగా మారింది. ఆ సంఘటన నేపథ్యంలో ఇక్కడ మ్యాచ్‌ల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే తాజాగా వచ్చిన అనుమతితో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

చిన్నస్వామి స్టేడియంలోనే ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్

ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28 నుండి ప్రారంభం కానుంది. ఈ సీజన్ తొలి పోరు బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరగనుంది. స్టేడియం మౌలిక సదుపాయాల పట్ల నిపుణుల కమిటీ సంతృప్తి వ్యక్తం చేసిందని KSCA సెక్రటరీ సంతోష్ మీనన్ ‘క్రిక్‌బజ్’కు ధృవీకరించారు. మార్చి 13న నిర్వహించిన మాక్ డ్రిల్ పరిశీలన అనంతరం కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మీడియా రిలీజ్‌లో KSCA ఏం చెప్పింది?

KSCA విడుదల చేసిన ప్రకటనలో ఇలా పేర్కొంది. ఈ విషయాన్ని తెలియజేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. కర్ణాటక హోం మంత్రి డాక్టర్ జి. పరమేశ్వర అధ్యక్షతన KSCA, RCB, DNA ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్టేడియంలో చేసిన ఏర్పాట్లపై నివేదిక సమర్పించాము. దీని ఆధారంగా చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు నిపుణుల కమిటీ అనుమతి ఇచ్చింది అని రాసుకొచ్చింది.

ఐపీఎల్ 2026 ఫైనల్ కూడా చిన్నస్వామిలోనే!

ఈ ఏడాది ఐపీఎల్‌లో ఈ మైదానం అనేక కీలక మ్యాచ్‌లకు వేదిక కానుంది. ఐపీఎల్ మొదటి మ్యాచ్, చివరి మ్యాచ్ (ఫైనల్) రెండూ ఇదే మైదానంలో జరుగుతాయి. ప్రారంభ మ్యాచ్‌లతో పాటు ఆర్సీబీ జట్టు మరో 5 మ్యాచ్‌లను ఇక్కడ ఆడుతుంది. మిగిలిన రెండు హోమ్ మ్యాచ్‌లను జట్టు రాయ్‌పూర్‌లో ఆడనుంది. ఇవే కాకుండా ఒక ప్లేఆఫ్ మ్యాచ్ కూడా చిన్నస్వామి స్టేడియంలోనే జరగనుంది.

  Last Updated: 16 Mar 2026, 02:38 PM IST