BCCI Central Contract: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI Central Contract) మహిళా క్రికెటర్ల సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించింది. ఆ తర్వాత ఇప్పుడు పురుషుల క్రికెటర్ల జాబితా వస్తుంది. దీనికి సంబంధించి చాలా చర్చలు జరుగుతున్నాయి. ఐపీఎల్ 2025లో ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే మ్యాచ్‌లో బీసీసీఐ సెక్రటరీ దేవ్‌జిత్ సైకియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌లతో ఈ విషయాన్ని చర్చించబోతున్నారని సమాచారం. సెంట్రల్ కాంట్రాక్ట్ ప్రకటన సాధారణంగా ఐపీఎల్‌కు ముందు జరుగుతుంది. కానీ ఈసారి అది ఆలస్యం అయింది.
సెంట్రల్ కాంట్రాక్ట్‌పై నిర్ణయం తీసుకోవడానికి ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసే వరకు BCCI వేచి ఉందని అనేక నివేదికలలో ఇంతకుముందు పేర్కొన్నారు. ‘దైనిక్ జాగరణ్’లోని ఒక నివేదిక ప్రకారం.. తీవ్రమైన చర్చలకు భారత ప్రధాన కోచ్ అందుబాటులో లేనందున సెంట్రల్ కాంట్రాక్ట్ ప్రకటన ఆలస్యమైంది. కాంట్రాక్ట్ గురించి ఆరా తీయడానికి బీసీసీఐ అధికారి ఇప్పటికే టీమ్ మేనేజ్‌మెంట్, చీఫ్ సెలక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు నివేదిక పేర్కొంది.
Also Read: Polavaram Project : ఈ ఏడాది చివరి నాటికి డయాఫ్రమ్ వాల్ పూర్తి – చంద్రబాబు
మార్చి 30న ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది
కాంట్రాక్ట్‌పై నిర్ణయం తీసుకోవడంలో బోర్డు, టీమ్ మేనేజ్‌మెంట్ ఇంకా ఏకాభిప్రాయం కాలేదని నివేదిక పేర్కొంది. అయితే మార్చి 30న జరిగే సమావేశంలో ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది. గంభీర్ సపోర్టు స్టాఫ్‌లో కోత పడవచ్చని, గత నాలుగేళ్లుగా టీమ్‌తో కొనసాగుతున్న ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ తన పదవిని వదులుకునే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఇది కాకుండా గంభీర్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చాట్, అభిషేక్ నాయర్‌లతో సహా ఇతర సభ్యుల ఒప్పందాలు అలాగే ఉంటాయని భావిస్తున్నారు. ఈ కాంట్రాక్ట్ జాబితా అక్టోబర్ 1, 2024 నుండి సెప్టెంబర్ 30, 2025 వరకు అమలులో ఉంటుంది. ఐపీఎల్ 2025 సీజన్ మధ్యలో ఈ ప్రకటన రావొచ్చని అభిమానులు ఆశిస్తున్నారు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 2024-25 సీజన్ కోసం పురుషుల క్రికెట్ ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ విషయంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. మహిళల క్రికెట్ జట్టు కోసం 2024-25 సీజన్ కాంట్రాక్ట్ జాబితా మార్చి 24, 2025న ప్రకటించబడింది. ఇందులో 16 మంది ఆటగాళ్లు మూడు గ్రేడ్‌లలో (A, B, C) చోటు సంపాదించారు.