Site icon HashtagU Telugu

Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ సూపర్ సెంచరీ.. సునీల్ గవాస్కర్‌ రికార్డు సమం!

Yashasvi Jaiswal

Yashasvi Jaiswal

Yashasvi Jaiswal: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. మూడవ రోజు అతను తన ఆరవ టెస్ట్ శతకాన్ని పూర్తి చేసి, జట్టుకు కీలకమైన ఆధిక్యాన్ని అందించాడు. ఈ సెంచరీతో అతను ఇంగ్లండ్‌పై అత్యధిక టెస్ట్ శతకాలు సాధించిన భారత ఓపెనర్లలో సునీల్ గవాస్కర్‌తో సమానంగా నిలిచాడు.

జైస్వాల్ అద్భుత ప్రదర్శన

ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో శతకం చేసిన జైస్వాల్.. ఆ తర్వాత మళ్ళీ అదే ఫామ్‌ను కొనసాగించలేకపోయాడు. అయితే ఐదవ టెస్ట్‌లో భారత జట్టుకు అత్యధిక పరుగులు అవసరమైన సమయంలో జైస్వాల్ మళ్ళీ బాధ్యత తీసుకొని అద్భుతమైన శతక ఇన్నింగ్స్ ఆడాడు. రెండవ రోజు వేగంగా ఆడిన అతను, మూడవ రోజు సహనంతో బ్యాటింగ్ చేసి 127 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 11 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు.

రికార్డులను సమం చేసిన జైస్వాల్

ఈ శతకంతో జైస్వాల్ ఇంగ్లండ్‌పై ఓపెనర్‌గా నాలుగు శతకాలు సాధించిన సునీల్ గవాస్కర్ రికార్డును సమం చేశాడు. గవాస్కర్‌కు ఈ ఘనత సాధించడానికి 37 మ్యాచ్‌లు పట్టగా.. జైస్వాల్ కేవలం 10 మ్యాచ్‌లలోనే దానిని సాధించడం విశేషం. అంతేకాకుండా ఇంగ్లండ్‌పై అత్యధిక టెస్ట్ శతకాలు సాధించిన భారత ఓపెనర్లలో కేఎల్ రాహుల్ 16 మ్యాచ్‌లలో ఐదు శతకాలతో అగ్రస్థానంలో ఉండగా, జైస్వాల్ ఇప్పుడు నాలుగు శతకాలతో రోహిత్ శర్మ, గవాస్కర్‌తో కలిసి రెండవ స్థానంలో ఉన్నాడు.

Also Read: Nathan Barnwell: క్రిస్ వోక్స్ ప్లేస్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఆట‌గాడు ఎవ‌రో తెలుసా?

మంచి ఆరంభం

రెండవ రోజు ఆట చివరిలో కేవలం 44 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసిన జైస్వాల్.. మూడవ రోజు అదే జోరును కొనసాగించాడు. అతను నైట్‌వాచ్‌మ్యాన్ ఆకాశ్ దీప్‌తో కలిసి ఇంగ్లండ్ ఫీల్డింగ్‌లోని లోపాలను సద్వినియోగం చేసుకుని 107 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆకాశ్ దీప్ 94 బంతుల్లో 66 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే, జైస్వాల్ మాత్రం తన బ్యాటింగ్‌తో జట్టును ముందుకు నడిపించి కీలకమైన శతకాన్ని సాధించాడు. కేవలం 23 ఏళ్ల వయసులోనే జైస్వాల్ టెస్ట్ క్రికెట్‌లో తనదైన ముద్ర వేస్తున్నాడు.