Cheteshwar Pujara: టీమిండియాకు సమాధానం చెప్పిన పుజారా.. దులీప్ ట్రోఫీలో అద్భుతమైన సెంచరీ..!

భారత క్రికెట్ జట్టు వెటరన్ ఆటగాడు ఛెతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara)కు వెస్టిండీస్ పర్యటనకు సెలెక్టర్లు అవకాశం ఇవ్వలేదు.

  • Written By:
  • Publish Date - July 7, 2023 / 02:45 PM IST

Cheteshwar Pujara: భారత క్రికెట్ జట్టు వెటరన్ ఆటగాడు ఛెతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara)కు వెస్టిండీస్ పర్యటనకు సెలెక్టర్లు అవకాశం ఇవ్వలేదు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో పుజారా ఘోరంగా విఫలం అయ్యాడు. దింతో పుజారాను వెస్టిండీస్ పర్యటనకు సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. అయితే పుజారా ఇప్పుడు మైదానంలో అద్భుతంగా పునరాగమనం చేశాడు. అతను దులీప్ ట్రోఫీ 2023 మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. ఈ టోర్నీలో వెస్ట్ జోన్ తరఫున పుజారా ఆడుతున్నాడు.

దులీప్ ట్రోఫీ 2023 మొదటి సెమీ-ఫైనల్ మ్యాచ్ వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్ మధ్య జరుగుతోంది. ఈ టోర్నీలో వెస్ట్ జోన్ తరఫున పుజారా ఆడుతున్నాడు. వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 220 పరుగులు చేసింది. ఇప్పుడు ఆ జట్టు రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది. ఇందులో పుజారా అద్భుత సెంచరీ సాధించాడు. ఈ వార్త రాసే సమయానికి అతను 118 పరుగులు చేశాడు. పుజారా 249 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు బాదాడు. పుజారా సెంచరీ సాయంతో వెస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది.

Also Read: World Cup 2023 Tickets: వరల్డ్ కప్ 2023కి సంబంధించిన మ్యాచ్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా.. టికెట్ ధర రూ. 10,000 వరకు ఉండే ఛాన్స్..?

వెస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో పృథ్వీ షా, ప్రియాంక్ పంచల్ ఓపెనర్లకగా వచ్చారు. ఈ సమయంలో షా కేవలం 25 పరుగులు చేసి ఔటయ్యాడు. 15 పరుగులు చేసిన తర్వాత పంచల్ నిష్క్రమించాడు. సూర్యకుమార్ యాదవ్ అర్ధ సెంచరీతో రాణించాడు. 58 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 52 పరుగులు చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ 6 పరుగులు చేశాడు. హెట్ పటేల్ 51 బంతులు ఎదుర్కొని 27 పరుగులు చేశాడు.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు పుజారా టీమ్ ఇండియాలో చోటు సంపాదించాడు. ఫైనల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 14 పరుగులకు, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 27 పరుగులకే ఔటయ్యాడు. దీంతో భారత్ సెలెక్టర్లు అతడిని జట్టు నుంచి తప్పించారు. వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో పుజారాకు జట్టులో చోటు దక్కలేదు. జూలై 12 నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు జరగనుంది. కాగా దీని తర్వాత రెండో మ్యాచ్ జూలై 20 నుంచి జరగనుంది.