Irani Cup: ఇరానీ కప్ 2025 (Irani Cup) టోర్నమెంట్‌లో విదర్భ, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య అక్టోబర్ 1 నుండి 5 వరకు జరిగిన మహా సంగ్రామంలో విదర్భ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, 93 పరుగుల తేడాతో విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. రజత్ పాటిదార్ సారథ్యంలోని రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు ఈ మ్యాచ్‌లో పరాజయాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. విదర్భ విజయంలో ఓపెనర్ అథర్వ తాయడే కీలక పాత్ర పోషించి, రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు.
తొలి ఇన్నింగ్స్‌లో విదర్భ ఆధిపత్యం
మొదటి ఇన్నింగ్స్‌లో విదర్భ జట్టు 101.4 ఓవర్లలో 342 పరుగులు చేసింది. జట్టు తరఫున అథర్వ తాయడే 283 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్సర్‌తో సహా అత్యధికంగా 143 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్‌ను ఆడాడు. అతనికి తోడుగా యశ్ రాథోడ్ కూడా 153 బంతుల్లో 91 పరుగులు సాధించాడు. దీనికి సమాధానంగా రెస్ట్ ఆఫ్ ఇండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 214 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు (125 బంతుల్లో 66 పరుగులు) కెప్టెన్ రజత్ పాటిదార్ చేశాడు. దీంతో విదర్భ జట్టుకు 128 పరుగుల కీలక ఆధిక్యం లభించింది.
Also Read: YS Sharmila: ఆటో డ్రైవర్లను మోసగించడంలో దొందు దొందే: వైఎస్ షర్మిల
రెండో ఇన్నింగ్స్ పోరాటం, లక్ష్య ఛేదనలో వైఫల్యం
రెండో ఇన్నింగ్స్‌లో విదర్భ 232 పరుగులు చేసింది. జట్టు తరఫున అమన్ మోఖడే 76 బంతుల్లో 37 పరుగులు సాధించాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ కొద్దికొద్దిగా పరుగులు జోడించారు. దీంతో రెస్ట్ ఆఫ్ ఇండియా ముందు 395 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. అయితే ఈ లక్ష్య ఛేదనలో రెస్ట్ ఆఫ్ ఇండియా కేవలం 267 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు తరఫున యశ్ ధుల్ అద్భుతంగా ఆడి 117 బంతుల్లో 92 పరుగులు చేశాడు. మానవ్ సుతార్ కూడా 113 బంతుల్లో 56 పరుగులు సాధించినప్పటికీ ఈ స్కోరు జట్టును గెలిపించడానికి సరిపోలేదు. తుది ఫలితంగా విదర్భ జట్టు 93 పరుగుల తేడాతో విజయం సాధించి, తమ ఖాతాలో మూడవ ఇరానీ కప్ టైటిల్‌ను చేర్చుకుంది.
