Rohit- Virat: టీమ్ ఇండియా సూపర్‌స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Rohit- Virat) ఇటీవల ఆస్ట్రేలియా సిరీస్‌లో మంచి ప్రదర్శన చేశారు. విరాట్ ఆఖరి మ్యాచ్‌లో పరుగులు చేయగా, రోహిత్ ఒక సెంచరీ ఒక అర్ధసెంచరీ సాధించాడు. అయినప్పటికీ వారిద్దరి వయస్సును ప్రస్తావిస్తూ వారిని జట్టు నుంచి తొలగించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘హిట్‌మ్యాన్’ (రోహిత్), ‘కింగ్’ (విరాట్)లకు భారత జట్టు మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ మద్దతు లభించింది. ఈ విషయంలో ఆయన బీసీసీఐకి స్పష్టమైన సందేశం ఇచ్చారు.
మాజీ సెలెక్టర్ శ్రీకాంత్ మద్దతు
రోహిత్ శర్మకు ఇప్పుడు 38 ఏళ్లు, విరాట్ కోహ్లీకి 36 ఏళ్లు. దీంతో జట్టులో వారి స్థానంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి సమాధానంగా సిడ్నీలో ఆస్ట్రేలియాపై అద్భుత ప్రదర్శన చేసి ఇద్దరూ సత్తా చాటారు. అయినప్పటికీ వయస్సును కారణంగా చూపిస్తూ వారి రిటైర్మెంట్‌పై చర్చ జరుగుతోంది.
Also Read: Arjun Tendulkar: కర్ణాటకతో మ్యాచ్‌లో మెరిసిన అర్జున్ టెండూల్కర్!
ఈ విషయంపై కే. శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. ‘రో-కో (రోహిత్-కోహ్లీ) 2027 ప్రపంచకప్‌కు సిద్ధంగా ఉన్నారు. నా అభిప్రాయం ప్రకారం రోహిత్ కచ్చితంగా 2027 ప్రపంచకప్ ఆడాలి. వయస్సు గురించి మాట్లాడకండి. అతను 40కి చేరుకుంటున్నాడు’ అని చెప్పడం మానేయండి. ఇదంతా ఆపండి. అతను ఫిట్‌గా ఉన్నాడు. బాగా ఆడుతున్నాడు. స్లిప్‌లో సులభంగా క్యాచ్‌లు పడుతున్నాడు. మీకు ఇంకేం కావాలి? అతను ప్రతి మ్యాచ్‌లో పరుగులు చేస్తున్నాడు. సిడ్నీలో కూడా అతను చాలా సునాయాసంగా ఆడాడు. అది 2019 ప్రపంచకప్‌లో అతను ఆడిన తీరును తలపించింది. అవును అతను ఆరో, ఏడో గేర్‌లోకి వెళ్లలేదు. కానీ మూడో, నాలుగో గేర్‌లో వెళ్తున్నాడు’ అని పేర్కొన్నారు.
రో-కోను భయపెట్టొద్దని శ్రీకాంత్ విజ్ఞప్తి
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి కే. శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘వారిని భయపెట్టకండి. వారిలో భయం సృష్టించకండి. వారిని ఒంటరిగా వదిలేయండి. మీరు వారికి జట్టుకు వారు ఎంత ముఖ్యమో చెప్పాలి. తమను తాము బాగా చూసుకోమని చెప్పండి. మేము మీ చుట్టూ జట్టును నిర్మిస్తాం. మీరిద్దరూ చాలా ముఖ్యం. దయచేసి మీరు పూర్తి ఫిట్‌గా ఉన్నారని నిర్ధారించుకోండి అని చెప్పాలి. ఇదే సరైన ఆలోచన, సంభాషణ అని నేను భావిస్తున్నాను. వారు అలా చేస్తే అది టీమ్ ఇండియాకు, ఇద్దరు ఆటగాళ్లకు మంచిది. నేనే సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌ను అయితే, ఈరోజే వారి దగ్గరకు వెళ్లి ‘మీరు 2027 ప్రపంచకప్‌కు ఫిట్‌గా ఉండండి. మాకు ట్రోఫీని గెలిపించండి’ అని చెబుతాను’ అని శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు.
