David Warner: నా… రాంగ్ సైడ్ త్రో కొంపముంచింది: వార్నర్

ఐపీఎల్ 2023లో నిన్న జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆరు వికెట్ల తేడాతో తొలి విజయాన్ని నమోదు చేసింది

David Warner: ఐపీఎల్ 2023లో నిన్న జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆరు వికెట్ల తేడాతో తొలి విజయాన్ని నమోదు చేసింది. రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ముంబై గెలుపే ధ్యేయంగా బరిలోకి దిగింది. కాగా… ఢిల్లీకి వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఓటమి ఎదురైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 172 పరుగులు చేసింది. ముంబై చివరి బంతికి నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.

అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 172 పరుగులకు ఆలౌటైంది. అక్షర్ పటేల్ 25 బంతుల్లో 54 పరుగులతో ఆకట్టుకున్నాడు.కెప్టెన్ డేవిడ్ వార్నర్ తన కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. 51 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఢిల్లీ కష్టాల్లో పడింది. కేవలం 7 పరుగులకే ఆఖరి ఐదు వికెట్లు కోల్పోయింది. బౌలింగ్‌లో ముంబై తరఫున జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, పీయూష్ చావ్లా చెరో మూడు వికెట్లు తీశారు. 173 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ చివరి బంతికి 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 65 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, తిలక్ వర్మ 41 పరుగులు చేశాడు. అదే సమయంలో ఇషాన్ కిషన్ కూడా 31 పరుగులు చేశాడు.

ఢిల్లీ ఓటమికి కారణం ఏంటో తన మాటల్లోనే చెప్పాడు ఢిల్లీ కెప్టెన్ వార్నర్ ( David Warner ). చివరి బంతిని రాంగ్ సైడ్ త్రో విసరడం వల్లనే ఓడిపోయాము. వికెట్ల హైట్ దృష్టిలో పెట్టుకుని బంతిని పైకి విసిరాను. ఆ త్రో ముంబైకి బాగా కలిసివచ్చింది. అలాగే వరుసగా వికెట్ల కుప్పకూలడం కూడా మా ఓటమికి కారణమన్నారు వార్నర్. గత మూడు మ్యాచులు చాలా ఉత్కంఠభరితంగానే సాగాయి. చివరి బంతిలో ఫలితం తేలింది. మా జట్టు ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. అందరూ బాధ్యతగా ఆడుతున్నారు. ఇక ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఆయన ఇన్నింగ్స్ జట్టు విజయానికి దోహద పడిందని అభిప్రాయపడ్డారు వార్నర్.

Read More: https://telugu.hashtagu.in/sports/mumbai-indians-win-a-thriller-against-delhi-capitals-132648.html