ఐపీఎల్‌కు ముందు సీఎస్కేకు బ్యాడ్ న్యూస్‌?!

నాథన్ ఎల్లిస్ నిష్క్రమణతో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు అతని స్థానంలో మరో బౌలర్ కోసం వెతుకుతోంది.

Published By: HashtagU Telugu Desk
CSK

CSK

CSK: ఐపీఎల్ 19వ సీజన్ కౌంట్‌డౌన్ మొదలైన వేళ ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ‘స్పోర్ట్స్ స్టార్’ కథనం ప్రకారం.. చెన్నై స్టార్ పేసర్ నాథన్ ఎల్లిస్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. 31 ఏళ్ల ఈ ఆస్ట్రేలియా పేసర్‌ను సీఎస్‌కే ఫ్రాంచైజీ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఎల్లిస్ హ్యామ్‌స్ట్రింగ్ సమస్యతో బాధపడుతున్నాడని, టోర్నీ ప్రారంభమయ్యే సమయానికి కోలుకోవడం సాధ్యం కాదని సమాచారం.

చెన్నైకి పెరిగిన కష్టాలు

నాథన్ ఎల్లిస్ దూరం కావడం చెన్నై సూపర్ కింగ్స్ ప్రణాళికలను దెబ్బతీసింది. ఈ సీజన్‌లో డెత్ ఓవర్లలో ఎల్లిస్ కీలక బౌలర్‌గా ఉంటాడని జట్టు భావించింది. గతంలో మతీషా పతిరానా ఈ బాధ్యతను నిర్వర్తించేవాడు. కానీ గత సీజన్ ప్రదర్శన తర్వాత అతడిని జట్టు విడుదల చేసింది. ఎల్లిస్ గత సీజన్‌లో కూడా సీఎస్‌కేలో ఉన్నప్పటికీ కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడే అవకాశం లభించింది (అందులో 1 వికెట్ తీశాడు). ఇప్పటివరకు ఐపీఎల్‌లో అతను మొత్తం 17 మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు పడగొట్టాడు.

Also Read: అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మ‌ధ్య యుద్ధం.. భార‌త్‌కు బ్యాడ్ న్యూస్‌!

ప్రత్యామ్నాయ బౌలర్ వేటలో CSK

నాథన్ ఎల్లిస్ నిష్క్రమణతో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు అతని స్థానంలో మరో బౌలర్ కోసం వెతుకుతోంది. ఈ విషయంపై సీఎస్‌కే సీఈఓ కె.ఎస్. విశ్వనాథన్ స్పందిస్తూ.. “ఇది మాకు పెద్ద ఎదురుదెబ్బ. ముఖ్యంగా చివరి ఓవర్లలో ఎల్లిస్ చాలా కీలకమైన బౌలర్. ప్రస్తుతం మేము అతని స్థానంలో రీప్లేస్‌మెంట్ కోసం చూస్తున్నాము” అని తెలిపారు.

CSK పూర్తి స్క్వాడ్

  • రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఎంఎస్ ధోని, సంజూ శాంసన్, శివం దూబే, డెవాల్డ్ బ్రెవిస్, ఆయుష్ మ్హత్రే, కార్తీక్ శర్మ, సర్ఫరాజ్ ఖాన్, ఉర్విల్ పటేల్, అన్షుల్ కంబోజ్, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, జేమీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, ప్రశాంత్ వీర్, మాథ్యూ విలియం షార్ట్, అమన్ ఖాన్, జాక్ ఫాల్క్స్, ముఖేష్ చౌదరి, నాథన్ ఎల్లిస్ (దూరమయ్యాడు), శ్రేయస్ గోపాల్, గుర్జాపనీత్ సింగ్, అఖీల్ హొస్సేన్, మాట్ హెన్రీ, రాహుల్ చాహర్.
  Last Updated: 19 Mar 2026, 07:11 PM IST