ప్రపంచ వ్యాప్తంగా సాకర్ ప్లేయర్స్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మోస్ట్ పాపులర్ స్పోర్ట్ కావడంతో అందులో స్టార్ ప్లేయర్స్‌ను తమ జట్ల తరపున ఆడించేందుకు పలు దేశాలకు చెందిన క్లబ్స్ పోటీపడుతుంటాయి. వేల కోట్లతో ఒప్పందాలు చేసుకుంటుంటాయి. తాజాగా పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) కోసం సౌదీ అరేబియాకు చెందిన ఓ క్లబ్ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఏడాదికి 200 మిలియన్ యూరోలు చెల్లించబోతోంది. అంటే రెండున్నరేళ్ళకు గానూ భారత కరెన్సీలో అక్షరాలా 4,400 కోట్ల ఇచ్చేందుకు డీల్ చేసుకుంది. కెరీర్ ముగించే స్టేజ్‌లో ఉన్న రొనాల్డోకు ఇది భారీ ఒప్పందంగానే చెప్పాలి. సౌదీ అరేబియాకు చెందిన అల్ నజర్ క్లబ్ తరపున రొనాల్డో బరిలోకి దిగనున్నాడు. రొనాల్డో తమ జెర్సీని పట్టుకున్న ఫొటోలను అల్ నజర్ ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ అతడికి స్వాగతం పలికింది. దీనిని సరికొత్త చరిత్రగా పేర్కొంచూ ఈ డీల్‌తో తమ క్లబ్ అద్భుత విజయాలను సాధించేలా ప్రేరణ పొందడమే గాక.. తమ దేశం, తమ భవిష్యత్తు తరాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు స్ఫూర్తినిస్తుందంటూ అల్ నజర్ ట్వీట్ చేసింది. సౌదీ క్లబ్‌తో 2025 జూన్ వరకు రొనాల్డో ఒప్పందం చేసుకున్నాడు. ఈ డీల్‌తో ప్రపంచ సాకర్‌లో అత్యధిక ధర కలిగిన ఆటగాడిగా రొనాల్డో (Cristiano Ronaldo) సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ డీల్‌పై రొనాల్డో కూడా ప్రకటన విడుదల చేశాడు. మరో దేశంలో కొత్త ఫుట్‌బాల్ లీగ్‌లో ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు. దాదాపు నాలుగేళ్లపాటు మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌కు ఆడాడు. ఆ తర్వాత రియల్ మాడ్రిడ్, జువెంటస్ క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. 14 ఏళ్ల తర్వాత 2021లో తిరిగి మాంచెస్టర్ క్లబ్‌కు వచ్చినప్పటికీ.. ఏడాదికే బయటకు వచ్చేశాడు.
Also Read: Best Foods for Fertility : వీటిని తింటే వంధ్యత్వ సమస్యకు చెక్ పెట్టినట్లే