Site icon HashtagU Telugu

Cricket Retirement: రిటైర్మెంట్ తీసుకున్న క్రికెటర్ మళ్లీ జ‌ట్టులోకి తిరిగి రావచ్చా?

Cricket Retirement

Cricket Retirement

Cricket Retirement: ఏదైనా వ్యక్తిగత కారణాల వల్ల ఆటగాడు ఎప్పుడైనా క్రికెట్ నుండి రిటైర్మెంట్ (Cricket Retirement) ప్రకటించవచ్చు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రకారం.. ఏ క్రికెటర్ అయినా ఏ సమయంలోనైనా రిటైర్మెంట్ తీసుకోవచ్చు. ఫిట్‌నెస్, ఫామ్, వ్యక్తిగత అభిప్రాయాలు లేదా వివాదాల కారణంగా ఆటగాళ్లు ఈ నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ సమయంలో ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఒక ఆటగాడు రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి రాగలరా? లేదా అనేది తెలుసుకుందాం.

ఆటగాళ్లు రిటైర్మెంట్ ఎందుకు తీసుకుంటారు?

రిటైర్మెంట్ నిర్ణయం అనేది ఆటగాళ్ల వ్యక్తిగతం. ఫిట్‌నెస్, ప్రదర్శన ప్రధాన కారణాలు కావచ్చు. ఎందుకంటే ఆటగాళ్లు ఫిట్‌గా లేనప్పుడు లేదా నిరంతరం మంచి ప్రదర్శన చూపలేనప్పుడు రిటైర్మెంట్ తీసుకోవడానికి మొగ్గు చూపుతారు. దీనికి వయస్సుతో సంబంధం లేదు. చాలా మంది ఆటగాళ్లు చిన్న వయస్సులోనే రిటైర్మెంట్ ప్రకటించినా సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాలు 40 ఏళ్ల వయస్సు వరకు ఆడారు. కొన్నిసార్లు బయటి ఒత్తిడి లేదా వివాదాల కారణంగా కూడా ఆటగాళ్లు ఆశించిన దానికంటే ముందే రిటైర్ కావాల్సి వస్తుంది.

Also Read: Curry Leaves: 30 రోజుల్లో మీ జుట్టు పెర‌గాలంటే.. కరివేపాకును ఉపయోగించండిలా!

పునరాగమనంపై ICC నిబంధనలు

రిటైర్ అయిన ఆటగాళ్లు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రావడానికి ICC స్వేచ్ఛ ఇస్తుంది. అయితే ఏ ఆటగాడి పునరాగమనం గురించిన నిర్ణయం అయినప్పటికీ అది ఆయా ఆటగాడి జాతీయ క్రికెట్ బోర్డు లేదా అతను ఆడాలనుకుంటున్న ఫ్రాంఛైజీ ద్వారా నిర్ణయించబడుతుంది.

రిటైర్మెంట్ తర్వాత తిరిగి వచ్చిన ఆటగాళ్లు

పాకిస్తాన్ ఆటగాడు షాయిద్ అఫ్రిది అనేకసార్లు రిటైర్మెంట్ ప్రకటించి, తిరిగి వచ్చారు. 2006లో టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కొన్ని నెలల్లోనే తిరిగి వచ్చారు. అదేవిధంగా 2011లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా ఆయన మళ్లీ వెనక్కి వచ్చారు. అదేవిధంగా పాకిస్తాన్ ఆటగాడు మహ్మద్ ఆమిర్ 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మార్చి 2024 టీ20 ప్రపంచ కప్ కోసం తిరిగి వచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు.

ఇంగ్లాండ్‌కు చెందిన కెవిన్ పీటర్సన్ కూడా 2011లో వైట్ బాల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి, కొన్ని నెలల తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అలాగే ఇంగ్లాండ్‌కే చెందిన మరో ఆటగాడు బెన్ స్టోక్స్ 2022లో వన్డేల నుండి రిటైర్మెంట్ తీసుకుని 2023 వన్డే ప్రపంచ కప్ కోసం తిరిగి జట్టులోకి వచ్చారు. వెస్టిండీస్ ఆటగాడు కార్ల్ హూపర్ 1999 ప్రపంచ కప్‌కు సరిగ్గా ముందు రిటైర్మెంట్ ప్రకటించి, 2001లో తిరిగి వచ్చి, జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు.

Exit mobile version