నవంబర్ 22వ తేదీ దగ్గర పడుతుండడంతో ఆస్ట్రేలియాలో టీమిండియా సన్నాహాలు కూడా ఊపందుకున్నాయి. భారత్ ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్ (Border-Gavaskar Trophy (BGT) 2024-25 ) నవంబర్ 22 నుండి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో తొలి టెస్టు మ్యాచ్ పెర్త్ వేదికగా జరగనుంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు భారత అభిమానులు సంతోషపడే వార్త ఒకటి బయటకు వచ్చింది. టీమ్‌ఇండియా టెస్ట్ క్రికెట్ పిల్లర్ గా భావించే చెతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) ఈ సిరీస్‌లో భాగమయ్యాడు. అయితే ఈసారి మైదానంలో బ్యాట్‌తో కాకుండా మరో పాత్రలో కనిపించనున్నాడు.
గత రెండు సార్లు స్వదేశంలో జరిగిన బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భారత జట్టు ఆస్ట్రేలియాను ఓడించింది. ఈ విజయాల్లో చెతేశ్వర్ పుజారా కీలక పాత్ర పోషించాడు. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి టీమ్ ఇండియా ఆస్ట్రేలియాలో బీజీటీ సిరీస్ ఆడాల్సి రావడంతో అభిమానులు పుజారాను చాలా మిస్సవుతున్నారు. అయితే జట్టులో భాగం కాకున్నా బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో స్టార్ స్పోర్ట్స్ తరపున పుజారా కామెంట్రీ చేయబోతున్నాడు. ఛెతేశ్వర్ పుజారా చాలా కాలంగా జాతీయ జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. అతను 2023 ప్రారంభంలో ఓవల్‌లో ఆస్ట్రేలియాతో తన చివరి మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత డ్రాప్ అయ్యి ఇప్పటి వరకు తిరిగి జట్టులోకి రాలేదు. పుజారా ఆస్ట్రేలియాలో 11 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 47.29 సగటుతో 993 పరుగులు చేశాడు.
పుజారా అంతర్జాతీయ క్రికెట్‌లో యాక్టివ్‌గా లేకపోవచ్చు, కానీ ప్రొఫెషనల్ క్రికెట్‌ను వదలలేదు. ఏదొ ఒక స్వదేశీ టోర్నీలలో ఆడుతూనే ఉన్నాడు. ఒక్కోసారి కౌంటీలో ప్రతిభ కనబరుస్తూ, ఒక్కోసారి దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల రంజీ ట్రోఫీ సందర్భంగా చత్తీస్‌గఢ్‌పై 234 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో పుజారా మరోసారి భారత జట్టుకు తిరిగి వస్తాడని అందరూ భావించారు. కానీ మేనేజ్మెంట్ అతడిని పరిగణలోకి తీసుకోలేదు. పుజారా 103 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. అందులో 43.60 సగటుతో 7195 పరుగులు చేశాడు. ఈ కాలంలో అతను 19 సెంచరీలు మరియు 35 అర్ధ సెంచరీలు చేశాడు.
Read Also : Fine Rice : జనవరిలో తెలంగాణ సర్కార్ సన్నబియ్యం పంపిణి చేయడం కష్టమే..!!