England Level Series: వరల్డ్ క్రికెట్ లో యాషెస్ ను ఎందుకు అత్యుత్తమ టెస్ట్ సీరీస్ గా పిలుస్తారో మరోసారి రుజువైంది. ఈ సీరీస్ లో ప్రతీ మ్యాచ్ హోరాహోరీగానే సాగుతోంది. ఆధిపత్యం కోసం ఆసీస్, ఇంగ్లండ్ చివరి బంతి వరకూ పోరాడుతాయి. అందుకే యాషెస్ అంటే దేశాలతో సంబంధం లేకుండా క్రికెట్ ఫాన్స్ ఆసక్తి చూపిస్తారు. తాజాగా మరోసారి ఈ సీరీస్ లో ఉన్న మజాను ఫాన్స్ ఆస్వాదించారు.
అత్యంత హోరాహోరీగా సాగిన యాషెస్ సిరీస్‌కు అదిరిపోయే ముగింపు లభించింది. సిరీస్ చివరి టెస్ట్ చివరి రోజు కూడా ఇరు జట్లూ నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. వర్షం అంతరాయం కలిగిస్తూ చికాకు పెట్టినా విజయం మాత్రం రెండు జట్లను ఊరించింది. రెండు టెస్టులు ఓడిపోయిన ఇంగ్లండ్ తర్వాత అద్భుతంగా పుంజుకుని సీరీస్ ను సమం (England Level Series) చేసింది.
చివరికి తన కెరీర్ ఆఖరి మ్యాచ్ లో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అదిరిపోయే బౌలింగ్ తో ఇంగ్లండ్ ను గెలిపించాడు. 384 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ లో ఓడిపోతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఎందుకంటే చివరి రోజు కూడా రెండు సెషన్ల పాటు ఆ జట్టే ఆధిపత్యం కనబరిచింది. వార్నర్, ఖవాజా హాఫ్ సెంచరీలు చేసి ఔటైనా స్టీవ్ స్మిత్ , ట్రావిస్ హెడ్ పోరాడటంతో ఆసీస్ విజయం ఖాయమని భావించారు. రెండు గంటలకు పైగా ఆట వర్షంతో ఆగిపోయినా.. మళ్లీ ఆట ఆరంభమయ్యాక హెడ్‌ను మొయిన్ అలీ ఔట్ చేయడం మ్యాచ్ ను ఆసక్తికరంగా మార్చింది. కాసేపటికే స్మిత్ కూడా వెనుదిరగడంతో ఇంగ్లండ్ పుంజుకుంది.
Also Read: India vs Pakistan: ప్రపంచకప్‌లో భారత్- పాకిస్థాన్ మ్యాచ్ కు కొత్త తేదీ ఫిక్స్.. కారణమిదే..!?
చివర్లో అలెక్స్ కేరీ, మర్ఫీ పోరాడటంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఈ దశలో బంతిని అందుకున్న స్టువర్ట్ బ్రాడ్ వీరిద్దరినీ ఔట్ చేసి ఇంగ్లండ్ కు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌తోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన బ్రాడ్ చివరి రెండు వికెట్లు తీసి గెలిపించడంతో ఇంగ్లాండ్ ఆటగాళ్లు, స్టేడియంలో ఇంగ్లీష్ ఫాన్స్ సంబరాలకు హద్దే లేకపోయింది. ఇంగ్లాండ్‌కు చిరస్మరణీయ విజయం అందించిన బ్రాడ్ కెరీర్‌ను అద్భుతంగా ముగించాడనీ పలువురు మాజీ ఆటగాళ్లు ప్రశంసలు కురిపించారు.
తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 283 రన్స్ చేయగా.. ఆస్ట్రేలియా 295 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 395 పరుగులు చేసింది. అయితే వరుసగా రెండు టెస్టులు ఓడిపోయిన ఇంగ్లండ్ తర్వాత అద్భుతంగా పుంజుకుని సీరీస్ ను సమం (England Level Series) చేసింది. అయితే గత సిరీస్‌ను ఆస్ట్రేలియానే గెలవడంతో యాషెస్ ట్రోఫీ ఆ జట్టుతోనే కొనసాగనుంది.