ఐపీఎల్‌లో విషాదం.. బ్రాడ్‌కాస్ట్ ఇంజనీర్ మృతి!

విషాదం జరిగిన రోజుకు ముందు (మార్చి 29న) వాంఖెడే మైదానంలో ముంబై ఇండియన్స్- కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది.

Published By: HashtagU Telugu Desk
British Broadcast Engineer

British Broadcast Engineer

British Broadcast Engineer: ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28న ఘనంగా ప్రారంభమైనప్పటికీ టోర్నమెంట్‌లో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఐపీఎల్ మ్యాచ్‌ల కవరేజ్ కోసం బ్రాడ్‌కాస్ట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఒక బ్రిటిష్ వ్య‌క్తి ముంబైలో మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చాయి.

హోటల్ గదిలో విగతజీవిగా..

మరణించిన వ్యక్తిని 76 ఏళ్ల బ్రిటిష్ వ్య‌క్తి ఇయాన్ విలియమ్స్ లాంగ్‌ఫోర్డ్గా గుర్తించారు. ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్ పనుల నిమిత్తం ఆయన మార్చి 24 నుండి ముంబైలోని ట్రైడెంట్ హోటల్‌లో బస చేస్తున్నాడు. మార్చి 29న వాంఖెడే స్టేడియంలో ముంబై ఇండియన్స్- కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ముగిసిన తర్వాత ఇయాన్‌ తన గదికి (నెంబర్ 2715) వెళ్లాడు.

మరుసటి రోజు అంటే మార్చి 30న హోటల్ రిసెప్షన్ నుండి ఆయనకు కాల్ చేసినా ఎటువంటి స్పందన రాలేదు. అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది గది వద్దకు వెళ్లి పిలిచినా లోపలి నుండి సమాధానం లేకపోవడంతో ‘మాస్టర్ కీ’ సహాయంతో తలుపులు తెరిచారు. అప్పటికే ఇయాన్ గదిలోని నేలపై పడి ఉండటం గమనించిన సిబ్బంది, వెంటనే హోటల్ వైద్యుడిని పిలిపించారు. పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు.

Also Read: ఐపీఎల్ 2026.. ప్లేఆఫ్స్‌కు చేరే జ‌ట్లు ఇవేనా?

ముంబై పోలీసుల దర్యాప్తు

ఈ ఘటనపై సమాచారం అందుకున్న ముంబై పోలీసులు రంగంలోకి దిగారు. మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్‌లో దీనిని ప్రమాదవశాత్తు మరణం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా ఇప్పటివరకు ఎటువంటి అనుమానాస్పద విషయాలు వెలుగులోకి రాలేదు. మరణించిన ఇంజనీర్ వయస్సు 76 ఏళ్లు కావడంతో సహజ కారణాల వల్ల లేదా అనారోగ్యం వల్ల మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు.

విషాదం జరిగిన రోజుకు ముందు (మార్చి 29న) వాంఖెడే మైదానంలో ముంబై ఇండియన్స్- కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు లక్ష్యాన్ని ఛేదించి అద్భుత విజయాన్ని అందుకుంది. ఆటగాళ్లు, అభిమానులు విజయ ఉత్సాహంలో ఉండగానే తెర వెనుక పనిచేసే సాంకేతిక నిపుణుడు మరణించడం టోర్నమెంట్‌లో విషాదాన్ని నింపింది.

  Last Updated: 31 Mar 2026, 03:29 PM IST