NZ Beat SL: ఫిలిప్స్‌ సెంచరీ.. లంకపై కివీస్‌ గ్రాండ్ విక్టరీ

టీ ట్వంటీ ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ సెమీఫైనల్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది.

Published By: HashtagU Telugu Desk
Nz

Nz

టీ ట్వంటీ ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ సెమీఫైనల్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకుంది. కీలక మ్యాచ్‌లో శ్రీలంకపై 65 పరుగుల తేడాతో విజయం సాధించింది. పవర్ ప్లేలో కివీస్ స్కోర్ చూసిన తర్వాత ఈ మ్యాచ్‌లో ఆ జట్టు గెలుస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే లంక బౌలర్లు షాకిచ్చారు. ఓపెనర్లు ఫిన్ అలెన్, వికెట్ కీపర్ కాన్వేతో పాటు కెప్టెన్ విలియమ్సన్‌లను సింగిల్ డిజిట్‌కే పెవిలియన్‌కు పంపారు. దీంతో కివీస్ 15 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.

ఈ దశలో గ్లెన్ ఫిలిప్స్ కివీస్ పాలిట ఆపద్భాందవుడయ్యాడు. మిఛెల్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 84 పరుగులు జోడించాడు. లంక బౌలర్లపై ఎటాకింగ్ బ్యాటింగ్‌తో రెచ్చిపోయిన ఫిలిప్స్ సెంచరీ సాధించాడు. 64 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 104 పరుగులు చేశాడు. ఈ ప్రపంచకప్‌లో ఇది రెండో సెంచరీ. అంతకుముందు సఫారీ బ్యాటర్ రొస్కో కూడా శతకంతో మెరిసాడు. ఫిలిప్స్ జోరుతో న్యూజిలాండ్ 167 పరుగులు చేసింది. లంక బౌలర్లలో రజిత 2, తీక్షణ, డిసిల్వా, హసరంగా, లహిరు కుమారా ఒక్కో వికెట్ పడగొట్టారు.

Also Read:   T20 World Cup 2022: ఆస్ట్రేలియా – ఇంగ్లండ్ మ్యాచ్ రద్దు.. కారణమిదే..!

168 పరుగుల లక్ష్యఛేదనలో లంక పూర్తిగా తేలిపోయింది.కివీస్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ధాటికి లంక బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. 24 పరుగులకే లంక జట్టులో సగం మంది పెవిలియన్‌ చేరుకున్నారు.నిస్సాంక , ధనుంజయ డిసిల్వా డకౌటవగా.. కుషాల్ మెండిస్ 4, అసలంక 4, కరుణారతనే 3 పరుగులకే ఔటయ్యారు. భనుక రాజపక్స, కెప్టెన్ శనక పోరాడినా కీలక సమయంలో ఔటయ్యారు. రాజపక్స 34, శనక 35 రన్స్ చేశారు. ఆసియాకప్‌లో అద్భుతంగా ఆడిన లంక టీ ట్వంటీ వరల్డ్‌కప్‌లో మాత్రం ఆశించిన^స్థాయిలో రాణించలేకపోతోంది. కివీస్‌పై బౌలర్లు ఆరంభంలో సత్తా చాటినా.. పేలవమైన ఫీల్డింగ్‌తో మూల్యం చెల్లించుకుంది.

చివరికి శ్రీలంక 102 పరుగులకే పరిమితమైంది. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్ 4 , శాంట్నర్ 2 ,సోథి 2, సౌథీ 1 , ఫెర్గ్యూసన్ 1, ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో కివీస్ సెమీస్ అవకాశాలు మెరుగవగా.. లంక సెమీఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉండగా.. లంక కింది నుంచి రెండో స్థానంలో ఉంది.

Cover Pic Courtesy: Twitter/Blackcaps

https://twitter.com/BLACKCAPS/status/1586319356694183936/photo/1

 

Also Read:   T20 Pakistan: భారత్ గెలవాలని కోరుకుంటున్న పాక్..!

 

  Last Updated: 29 Oct 2022, 05:31 PM IST