Site icon HashtagU Telugu

Asia Cup 2025: ఆసియా క‌ప్ ఎఫెక్ట్‌.. అధ్యక్ష పదవి నుంచి నక్వీ ఔట్‌?!

India Without Sponsor

India Without Sponsor

Asia Cup 2025: 2025లో భారతదేశంలో జరగనున్న ఆసియా కప్‌ (Asia Cup 2025) టోర్నమెంట్‌పై అనిశ్చితి మేఘాలు అలుముకున్నాయి. ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన కీలక అంశాలను చర్చించడానికి ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఢాకాలో సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. అయితే, ఈ సమావేశం ఢాకాలో జరగడాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బీసీసీఐతో పాటు మరో మూడు దేశాల క్రికెట్ బోర్డులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ బీసీసీఐకి మద్దతుగా నిలిచాయి. భారత్, బంగ్లాదేశ్ మధ్య క్షీణిస్తున్న రాజకీయ సంబంధాలే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం.

మొహ్సిన్ నక్వీ వైఖరిపై ప్రశ్నలు

ఏసీసీ చైర్మన్‌గా ఉన్న మొహ్సిన్ నక్వీ.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడిగానే కాకుండా పాకిస్తాన్ హోం మినిస్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొహ్సిన్ నక్వీ పాకిస్తాన్ రాజకీయ నాయకుల ఒత్తిడితోనే ఈ సమావేశాన్ని ఢాకాలో నిర్వహించాలని పట్టుబడుతున్నారని బీసీసీఐ అనుమానిస్తోంది. దీనిని బీసీసీఐ అధికారికంగా నక్వీకి తెలియజేసింది. ఒకవేళ ఏసీసీ సమావేశం ఢాకాలో జరిగితే, తాము అందులో పాల్గొనబోమని బీసీసీఐ స్పష్టం చేసింది.

Also Read: Vitamin Deficiency: అల‌స‌ట‌, ఆక‌లి లేక‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌లున్నాయా? అయితే విట‌మిన్ లోపం ఉన్న‌ట్లే!

చాలా కాలంగా పీసీబీ ఏదో ఒక విషయంలో బీసీసీఐ నిర్ణయాలలో జోక్యం చేసుకుంటుందనే ఆరోపణలు ఉన్నాయి. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో కూడా ఇలాంటి పరిస్థితులే తలెత్తాయి. అప్పుడు పీసీబీ బలవంతంగా టీమ్ ఇండియాను పాకిస్తాన్‌లో ఆడాలని కోరగా, లేనిపక్షంలో ఐసీసీ టోర్నమెంట్లలో భారత్‌తో ఆడబోమని బెదిరించింది.

నక్వీ పదవికి ముప్పు? ఆసియా కప్‌ భవితవ్యం!

జయ్ షా ఐసీసీ చైర్మన్‌గా నియమితులైన తర్వాత, ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా మొహ్సిన్ నక్వీ నియమితులయ్యారు. ఆయన అధ్యక్షతలో జరుగుతున్న మొదటి ఆసియా కప్ టోర్నమెంట్‌పైనే ఇలాంటి అనిశ్చితి నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది. మొహ్సిన్ నక్వీ ఢాకాలో సమావేశాన్ని నిర్వహించడంపై పట్టుదలతో ఉంటే, టీమ్ ఇండియా 2025 ఆసియా కప్‌లో ఆడకపోవచ్చు. అంతేకాదు బీసీసీఐ ఈ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించి మొహ్సిన్ నక్వీని ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్ష పదవి నుంచి తొలగించే అవకాశం కూడా ఉందని క్రికెట్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఆసియా కప్ 2025 సెప్టెంబర్‌లో నిర్వహించడానికి స‌న్న‌హాలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ టోర్నమెంట్ జరుగుతుందా లేదా అనేది వేచి చూడాలి. ఇటీవల 2025 వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో కూడా భారతీయ ఆటగాళ్లు పాకిస్తాన్‌తో ఆడటానికి నిరాకరించడంతో ఆ మ్యాచ్ రద్దు కావడాన్ని బట్టి చూస్తే, ఈ వివాదం ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది.