ఐసీసీ అధికారి వీసా తిర‌స్క‌రించిన బంగ్లాదేశ్‌!

టీ20 వరల్డ్ కప్ 2026లో బంగ్లాదేశ్ గ్రూప్ మ్యాచ్‌లు భారత్‌లో జరగాల్సి ఉంది. మొదటి మూడు మ్యాచ్‌లు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో చివరి గ్రూప్ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిర్వహించాల్సి ఉంది.

Published By: HashtagU Telugu Desk
Bangladesh

Bangladesh

Bangladesh: టీ20 వరల్డ్ కప్ 2026కు సంబంధించి బంగ్లాదేశ్ పట్టుబట్టి కూర్చుంది. టోర్నమెంట్‌కు భారత్‌తో కలిసి సహ-ఆతిథ్యమిస్తున్న శ్రీలంకకు తమ మ్యాచ్‌లను మార్చాలని డిమాండ్ చేస్తోంది. అయితే టోర్నీ ప్రారంభానికి కేవలం 20 రోజులే సమయం ఉండటంతో షెడ్యూల్‌ను మార్చడం అంత సులభం కాదు. ఈ విషయమై చర్చించేందుకు ఐసీసీకి చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు నేడు బీసీబీతో మాట్లాడేందుకు ఢాకా వెళ్లాల్సి ఉంది. కానీ భారత సంతతికి చెందిన ఒక అధికారికి బంగ్లాదేశ్ వీసా నిరాకరించింది. ఈ కారణం చేత ఐసీసీ తరపున ఒకే ఒక్క అధికారి ఢాకా వెళ్లగలిగారు.

ఐసీసీ ఇద్దరు అధికారులు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరిపేందుకు ఢాకా వెళ్లాల్సి ఉండగా.. బంగ్లాదేశ్ ఇక్కడ కూడా అడ్డంకులు సృష్టించింది. భారత సంతతికి చెందిన ఐసీసీ అధికారికి వారు వీసా ఇవ్వలేదు. ఓ నివేదిక ప్ర‌కారం.. ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్, సెక్యూరిటీ చీఫ్ ఆండ్రూ ఎఫ్‌గ్రేవ్ ఒంటరిగానే ఢాకా చేరుకున్నారు. వాస్తవానికి ఆయనతో పాటు మరో అధికారి వెళ్లాల్సి ఉంది. కానీ భారత సంతతికి చెందిన ఆ అధికారికి వీసా ఇవ్వడంలో బంగ్లాదేశ్ జాప్యం చేసింది. మీటింగ్ ముందే ఖరారు కావడంతో ఆండ్రూ ఒక్కరే ఢాకా వెళ్లారు.

Also Read: భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలలో కొత్త చిక్కులు?!

బీసీబీకి నచ్చజెప్పనున్న ఐసీసీ అధికారి

ఐసీసీ బంగ్లాదేశ్ వెళ్లడం వెనుక ముఖ్య ఉద్దేశం ఈ వివాదాన్ని సద్దుమణిగేలా చేయడం. నివేదికల ప్రకారం.. ఎఫ్‌గ్రేవ్ ఒక వివరణాత్మక భద్రతా ప్రణాళికను సమర్పించవచ్చు. ఇందులో భారత పర్యటనలో బంగ్లాదేశ్ జట్టుకు ఎలాంటి భద్రత కల్పిస్తారో, భారత్‌లో జట్టుకు ఎలాంటి ముప్పు లేదని ఐసీసీ ఎందుకు భావిస్తుందో వివరిస్తారు. ఐసీసీ అధికారి కేవలం బీసీబీ అధికారులతోనే కాకుండా అక్కడి యువజన- క్రీడల మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో కూడా సమావేశం కానున్నారు.

భారత్‌కు రావడానికి బంగ్లాదేశ్ ఎందుకు నిరాకరిస్తోంది?

టీ20 వరల్డ్ కప్ 2026లో బంగ్లాదేశ్ గ్రూప్ మ్యాచ్‌లు భారత్‌లో జరగాల్సి ఉంది. మొదటి మూడు మ్యాచ్‌లు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో చివరి గ్రూప్ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిర్వహించాల్సి ఉంది. బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందూ యువకుల హత్యకు నిరసనగా భారత్‌లో చాలా మంది కేకేఆర్, ఆ జట్టు యజమాని షారుఖ్ ఖాన్‌ను వ్యతిరేకించారు. ముస్తాఫిజుర్ రెహమాన్‌ను జట్టు నుండి విడుదల చేయాలని బీసీసీఐ కేకేఆర్‌ను ఆదేశించగా, ఫ్రాంచైజీ అలాగే చేసింది. దీని తర్వాత బంగ్లాదేశ్ తన దేశంలో ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేసింది. అంతేకాకుండా టీ20 వరల్డ్ కప్ కోసం భారత్‌కు రాబోమని బీసీబీ ఐసీసీకి తేల్చి చెప్పింది. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తోంది.

టీ20 వరల్డ్ కప్ 2026లో బంగ్లాదేశ్ షెడ్యూల్

  • శనివారం, ఫిబ్రవరి 7: బంగ్లాదేశ్ వర్సెస్ వెస్టిండీస్ (ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా)
  • సోమవారం, ఫిబ్రవరి 9: బంగ్లాదేశ్ వర్సెస్ ఇటలీ (ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా)
  • శనివారం, ఫిబ్రవరి 14: బంగ్లాదేశ్ వర్సెస్ ఇంగ్లాండ్ (ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా)
  • మంగళవారం, ఫిబ్రవరి 17: బంగ్లాదేశ్ వర్సెస్ నేపాల్ (వాంఖడే, ముంబై)
  Last Updated: 17 Jan 2026, 05:05 PM IST