IPL Broadcast ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రసారాల విషయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుంది. దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై ఎలాంటి ఆంక్షలు లేవని, గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు స్పష్టం చేసింది. క్రీడలను, రాజకీయాలను కలపదల్చుకోలేదని, ఈ అంశాన్ని పూర్తిగా వాణిజ్య కోణంలోనే చూస్తామని బంగ్లాదేశ్ కొత్త సమాచార, ప్రసార శాఖ మంత్రి జహీర్ ఉద్దీన్ స్వపన్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో బంగ్లాదేశ్‌లోని క్రికెట్ అభిమానులకు శుభవార్త అందినట్లయింది.
ఈ విషయంపై మంత్రి జహీర్ ఉద్దీన్ మాట్లాడుతూ.. “ఐపీఎల్ ప్రసారాల కోసం ఇప్పటివరకు ఎవరూ మమ్మల్ని సంప్రదించలేదు. క్రీడల్లోకి రాజకీయాలను తీసుకురావాలని మేము కోరుకోవడం లేదు. దీనిని మేము వాణిజ్యపరంగానే పరిశీలిస్తాం. ఏదైనా ఛానెల్ ప్రసారాల కోసం దరఖాస్తు చేసుకుంటే, సానుకూలంగా పరిశీలిస్తాం” అని డ్యుయిష్ వెల్లెకు తెలిపారు. స్టార్ స్పోర్ట్స్ వంటి అంతర్జాతీయ నెట్‌వర్క్‌లు ఐపీఎల్‌ను ప్రసారం చేయాలనుకుంటే చేసుకోవచ్చని, ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు సృష్టించదని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వ తాజా నిర్ణయాన్ని బంగ్లాదేశ్ కేబుల్ ఆపరేటర్ల సంఘం కూడా స్వాగతించింది. ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారాలను అడ్డుకోవాలని తమకు ఎలాంటి అధికారిక ఆదేశాలు లేవని ఆ సంఘం కార్యదర్శి రెజాల్ కరీం లబ్లు తెలిపారు. “గత మధ్యంతర ప్రభుత్వ ఆదేశాలకు ఇప్పుడు విలువ లేదు. ప్రస్తుత ప్రభుత్వం ఆదేశిస్తే తప్ప ప్రసారాలను నిలిపివేసేది లేదు. కాబట్టి స్టార్ స్పోర్ట్స్ ప్రసారం చేస్తే, మేము దానిని కొనసాగిస్తాం” అని ఆయన వివరించారు.
గతంలో మహమ్మద్ యూనుస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల నేపథ్యంలో బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌తో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టును బీసీసీఐ కోరింది. ఈ పరిణామంతో ఆగ్రహించిన నాటి బంగ్లా ప్రభుత్వం ఐపీఎల్ ప్రసారాలను దేశంలో నిలిపివేసింది. అయితే, కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ఆంక్షలు తొలగిపోయాయి. తాజా ప్రకటనతో ఐపీఎల్ 2026 సీజన్ ప్రసారాలకు మార్గం సుగమమైంది.
