Site icon HashtagU Telugu

Babar Azam : రోహిత్, కోహ్లి రికార్డు బ్రేక్ చేసిన బాబర్ ఆజామ్.. టీ20ల్లో నెంబర్ 1 రన్ స్కోరర్‌!

Babar Azam Virat Rohit

Babar Azam Virat Rohit

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా లెజెండ్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను అధిగమించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించిన బాబర్, 11 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 9 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను సమం చేసింది. ఫహీమ్ అష్రఫ్ నాలుగు వికెట్లతో అదరగొట్టగా, సైమ్ అయూబ్ 71 పరుగులతో రాణించాడు.

పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజామ్ మరో అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్నాడు. పురుషుల టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. బాబర్ 123 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 4,234 పరుగులు చేసి భారత దిగ్గజాలైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను అధిగమించాడు. రోహిత్ 151 ఇన్నింగ్స్‌ల్లో 4,231 పరుగులు సాధించగా, విరాట్ 117 ఇన్నింగ్స్‌ల్లో 4,188 పరుగులు సాధించాడు.

దక్షిణాఫ్రికాతో లాహోర్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో బాబర్ 18 బంతుల్లో 11 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో బాబర్ రోహిత్ రికార్డును అధిగమించాడు. పాకిస్తాన్ ఆ మ్యాచ్‌ను 9 వికెట్ల తేడాతో ఈజీగా గెలిచింది.

బాబర్ ప్రస్తుతం 39.57 యావరేజ్‌తో కొనసాగుతుండగా, రోహిత్ 32.05, విరాట్ 48.69తో ఉన్నారు. స్ట్రయిక్‌రేట్ పరంగా రోహిత్ ముందంజలో ఉన్నప్పటికీ, బాబర్ స్థిరమైన ప్రదర్శనతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఘనతను దక్షిణాఫ్రికా బౌలర్ డోనోవన్ ఫెరెయిరా బౌలింగ్‌లో ఒక సింగిల్ తీసి సాధించాడు.

ఆసియా కప్‌లో పాకిస్తాన్ ఓటమి తర్వాత తీవ్ర విమర్శల నడుమ బాబర్‌ను తిరిగి జట్టులోకి వచ్చాడు. 2024 టీ20 ప్రపంచ కప్ తర్వాత రోహిత్, విరాట్ తమ కెరీర్‌కు వీడ్కోలు పలికినందున, బాబర్ ఆజామ్ రికార్డులన్నీ సొంతం చేసుకునే పనిలో పడ్డాడు. ప్రస్తుత టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో బాబర్‌కు సమానంగా పోటీ ఇవ్వగల ఆటగాడు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ మాత్రమే. బట్లర్ ఇప్పటివరకు 132 ఇన్నింగ్స్‌ల్లో 3,869 పరుగులు చేశాడు.

రెండో టీ 20లో పాకిస్తాన్ అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఆల్‌రౌండర్ ఫహీమ్ అష్రఫ్ నాలుగు వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను 110 పరుగులకే ఆలౌట్ చేశాడు. అనంతరం సైమ్ అయూబ్ 71 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ విజయం పాకిస్తాన్‌ను మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1 – 1తో సమం చేసింది. ఫైనల్ మ్యాచ్‌ నవంబర్ 1న లాహోర్ స్టేడియంలో జరగనుంది.

Exit mobile version