Site icon HashtagU Telugu

WTC Final 2023: ఫాలో ఆన్ తప్పినా ఆసీస్ దే పై చేయి

WTC Final 2023

Whatsapp Image 2023 06 10 At 12.00.56 Am

WTC Final 2023: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో మూడోరోజు ఆట రసవత్తరంగా సాగింది. రెండోరోజు చివర్లో కీలక వికెట్లు కోల్పోయి ఫాలో ఆన్ గండం ముంగిట నిలిచిన టీమిండియాను రహానే, శార్థూల్ ఠాకూర్ ఆదుకున్నారు. ఆట ఆరంభమైన రెండో బంతికే శ్రీకర్ భరత్ ఔటవడంతో ఫాలో ఆన్ తప్పదనిపించింది. ఈ దశలో రహానే అద్భుత పోరాటం, శార్థూల్ సమయోచిత బ్యాటింగ్ భారత్ ను కాపాడింది. ఐపీఎల్ లో మెరుపులు మెరిపించి మళ్ళీ జాతీయ జట్టులోకి వచ్చిన రహానే ఆపద్భాందవుని పాత్ర పోషించాడు. వేగంగా ఆడుతూ పరుగుు సాధించాడు. అటు శార్థూల్ కూడా చక్కని సపోర్ట్ ఇవ్వడంతో భారత్ ఇన్నింగ్స్ లంచ్ వరకూ సాఫీగా సాగింది. రహానే , శార్థూల్ 109 పరుగుల పార్టనర్ షిప్ నమోదు చేశారు.

రహానే 92 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లంచ్ తర్వాత రహానే 89 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర ఔటవగా.. ఇక్కడ నుంచి శార్థూల్, టెయిలెండర్లతో బ్యాటింగ్ కొనసాగించాడు. షమీ సహకారంతో శార్దూల్ ఠాకూర్ 108 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.ఓవల్ మైదానంలో శార్దూల్‌కు ఇది వరుసగా మూడో హాఫ్ సెంచరీ. శార్థూల్ ఔటైన తర్వాత భారత్ ఇన్నింగ్స్ కు త్వరగానే తెరపడింది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 296 పరుగులకు ఆలౌటవడంతో… ఆసీస్ కు 173 పరుగుల భారీ ఆదిక్యం దక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కంగారూలను భారత బౌలర్లు కట్టడి చేశారు. వార్నర్, ఖవాజాలను త్వరగానే ఔట్ చేయడంతో ఆసీస్ 24 రన్స్ కే 2 వికెట్లు కోల్పోయింది. అయితే లబూషేన్ , స్మిత్ నిలకడగా ఆడుతూ 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. స్మిత్ 34 పరుగులకు ఔటవగా… తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో హెడ్ ను 18 రన్స్ కే జడేజా పెవిలియన్ కు పంపాడు. తర్వాత లబూషేన్ , కామెరూన్ గ్రీన్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. దీంతో మూడోరోజు ఆటముగిసే సమయానికి ఆస్ట్రేలియా 4 వికెట్లకు 123 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆసీస్ 296 పరుగుల ఆధిక్యంలో ఉండగా… నాలుగురోజు రెండు సెషన్లు బ్యాటింగ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ మ్యాచ్ ను డ్రాగా ముగించేందుకు ఇక భారత్ పోరాడాల్సి ఉంటుందని చెప్పొచ్చు.

Read More: WTC Final Day 1: తొలిరోజే తప్పిదాలు.. కెప్టెన్ రోహిత్ శర్మ తెలిసి చేశాడా..? తెలియక చేశాడా..?