ఐసీసీ టీ20 వరల్డ్ కప్.. ఆస్ట్రేలియా ఇంటికేనా?!

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు.

Published By: HashtagU Telugu Desk
Australia

Australia

Australia: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా జరిగిన 30వ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పల్లెకెలె ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 182 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. శ్రీలంక జట్టు కేవలం 18 ఓవర్లలోనే 184 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో శ్రీలంక సూపర్-8కు అర్హత సాధించగా, ఆస్ట్రేలియాకు సూపర్-8 దారి కష్టతరమైంది. ఈ విజయంలో నిస్సంక కీలక పాత్ర పోషించాడు. అతను కేవలం 52 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికి తోడుగా కుసాల్ మెండిస్ 51 పరుగులతో రాణించాడు.

181 పరుగులకే పరిమితమైన ఆస్ట్రేలియా

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ మెరుపు అర్ధశతకాలతో విరుచుకుపడి, మొదటి వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హెడ్ 29 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 56 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే హెడ్ నిష్క్రమణ తర్వాత ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ తడబడింది. ఆ తర్వాతి ఓవర్‌లోనే కామరూన్ గ్రీన్ (3) పెవిలియన్ చేరగా మార్ష్ కూడా 27 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేసి వెనుదిరిగాడు.

Also Read: ఫిబ్ర‌వ‌రి 26న విజ‌య్‌- ర‌ష్మిక పెళ్లి?!

ఆ తర్వాత వికెట్ల పతనం కొనసాగింది. టిమ్ డేవిడ్ (6), గ్లెన్ మాక్స్‌వెల్ (22), జోష్ ఇంగ్లిస్ (27), కూపర్ కానోలీ (3) తక్కువ స్కోర్లకే అవుట్ అయ్యారు. ఇక చివరి ఓవర్‌లో మార్కస్ స్టోయినిస్ (4), జేవియర్ బార్ట్లెట్ (0), ఆడమ్ జంపా (1) ముగ్గురూ అవుట్ అవ్వడంతో ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌట్ అయింది. శ్రీలంక బౌలర్లలో దుషన్ హేమంత అద్భుత ప్రదర్శన చేస్తూ 3 వికెట్లు పడగొట్టాడు. దుష్మంత చమీర 2 వికెట్లు తీయగా, మహీష్ తీక్షణ, దునిత్ వెల్లలాగే, కమిందు మెండిస్ తలో వికెట్ దక్కించుకున్నారు.

ఆస్ట్రేలియా పరిస్థితి గందరగోళం

ఈ ఓటమితో ఆస్ట్రేలియా సూపర్-8 ఆశలు క్లిష్టంగా మారాయి. దీనికి ముందు జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా 23 పరుగుల తేడాతో ఓడిపోయింది. ప్రస్తుతం గ్రూప్-బి పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక్క విజయంతో మూడో స్థానంలో ఉంది. ఇప్పుడు ఆస్ట్రేలియా తదుపరి దశకు వెళ్లాలంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

ఆస్ట్రేలియా తన చివరి లీగ్ మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న ఒమన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలవడంతో పాటు, మిగిలిన సమీకరణాలు కూడా వారికి అనుకూలంగా ఉండాలి. మరోవైపు, రెండో స్థానంలో ఉన్న జింబాబ్వే ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. జింబాబ్వే తన తదుపరి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను ఓడిస్తే, వారు నేరుగా సూపర్-8కు అర్హత సాధిస్తారు.

  Last Updated: 16 Feb 2026, 10:38 PM IST