Semi Final Matches: 2026 టీ20 ప్రపంచకప్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. సూపర్-8 మ్యాచ్‌లు కూడా ముగిశాయి. సెమీఫైనల్ చేరిన నాలుగు జట్లు ఖరారయ్యాయి. భారత్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్‌లోకి ప్రవేశించాయి. మొదటి సెమీఫైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికా- న్యూజిలాండ్ మధ్య జరుగుతుంది. ఇక రెండో సెమీఫైనల్ మ్యాచ్ భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య జరగనుంది.
సెమీఫైనల్ వేదికలు కూడా ఖరారయ్యాయి. నిజానికి పాకిస్థాన్ కారణంగా మొదటి సెమీఫైనల్ వేదికను ప్రకటించలేదు. కానీ పాకిస్థాన్ టోర్నమెంట్ నుండి నిష్క్రమించడంతో వేదికలను ఖరారు చేశారు. మొదటి సెమీఫైనల్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. అలాగే రెండో సెమీఫైనల్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది.
Also Read: సెమీఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఉంటుందా?
బుధవారం, మార్చి 4న మొదటి సెమీఫైనల్
దక్షిణాఫ్రికా- న్యూజిలాండ్ మధ్య 2026 టీ20 ప్రపంచకప్‌లో మొదటి సెమీఫైనల్ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది. సాయంత్రం ఆరున్నర గంటలకు టాస్ పడుతుంది. ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. అయితే లీగ్ దశలో దక్షిణాఫ్రికా ఇప్పటికే న్యూజిలాండ్‌ను ఘోరంగా ఓడించింది.
గురువారం, మార్చి 5న రెండో సెమీఫైనల్
భారత్- ఇంగ్లండ్ మధ్య 2026 టీ20 ప్రపంచకప్‌లో రెండో సెమీఫైనల్ జరగనుంది. సాయంత్రం ఆరున్నర గంటలకు టాస్ పడుతుంది. ఏడు గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో భారత్‌ను ఇంగ్లండ్ ఓడించి టోర్నీ నుంచి బయటకు పంపింది. ఇప్పుడు భారత్‌కు ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంది.
వర్షం కోసం రిజర్వ్ డే
2026 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల కోసం ఐసీసీ ‘రిజర్వ్ డే’ను కేటాయించింది. మార్చి 4న జరిగే మొదటి సెమీఫైనల్‌లో వర్షం కురిసి మ్యాచ్ జరగకపోతే మరుసటి రోజున మ్యాచ్‌ను నిర్వహిస్తారు. అదేవిధంగా మార్చి 5న కూడా మ్యాచ్ జరగకపోతే మరుసటి రోజున నిర్వహిస్తారు. అయితే మొదట నిర్ణయించిన సమయానికే మ్యాచ్ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ కనీసం 5 ఓవర్ల మ్యాచ్ కూడా జరగడం సాధ్యం కాకపోతేనే రిజర్వ్ డేను ఉపయోగిస్తారు.
