Arjun Tendulkar: రంజీ ట్రోఫీ 2025-26లో మొత్తం 38 జట్లు పాల్గొంటున్నాయి. అక్టోబర్ 25 నుంచి రౌండ్ 2 మ్యాచ్‌లు జరుగుతుండగా ఇందులో కర్ణాటక, గోవా జట్లు కూడా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గోవా తరఫున సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ అద్భుత ప్రదర్శన చేశాడు. అతను ముందుగా బౌలింగ్‌లో తన సత్తా చాటగా.. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ మెరిశాడు. ప్రస్తుతం అర్జున్ ప్రదర్శన క్రీడావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
బంతితో కట్టుదిట్టమైన బౌలింగ్
కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కర్ణాటక ఓపెనర్ నికిన్ జోస్‌ను, అలాగే మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కృష్ణన్ శ్రీజిత్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అభినవ్ మనోహర్‌ను కూడా పెవిలియన్ చేర్చాడు. ఈ విధంగా గోవా తరఫున తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. అర్జున్ 29 ఓవర్లలో 100 పరుగులు ఇచ్చి 3.44 ఎకానమీ రేటుతో మూడు వికెట్లు తీశాడు. అతనితో పాటు గోవా తరఫున వాసుకి కౌశిక్ కూడా మూడు వికెట్లు తీశాడు.
Also Read: CM Chandrababu: సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్!
బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడు
బౌలింగ్ చేసిన అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన అర్జున్ టెండూల్కర్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి నాటౌట్‌గా నిలిచాడు. అతను 115 బంతుల్లో 43 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. నాల్గో రోజు గోవా జట్టు అతనిపై చాలా ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ మ్యాచ్‌లో గోవా తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ అర్జున్ కావడం విశేషం.
మ్యాచ్ పరిస్థితి ఇలా ఉంది
కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 110.1 ఓవర్లలో 371 పరుగులు చేసింది. ఆ జట్టు తరఫున కరుణ్ నాయర్ 267 బంతుల్లో 174 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. శ్రేయస్ గోపాల్ 109 బంతుల్లో 57 పరుగులు చేశాడు. దీనికి సమాధానంగా బ్యాటింగ్‌కు దిగిన గోవా జట్టు 77 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. గోవా ఇంకా 200 పరుగుల వెనుకంజలో ఉంది.
