Site icon HashtagU Telugu

Champions Trophy: మ‌రోసారి ఐసీసీ బోర్డు స‌మావేశం వాయిదా.. రేపు ఫైన‌ల్ మీటింగ్‌!

Champions Trophy Final

Champions Trophy Final

Champions Trophy: పాకిస్థాన్‌లో రోజురోజుకు దిగజారుతున్న పరిస్థితి వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy)ని నిర్వహించడంపై ప్రశ్నలను లేవనెత్తింది. మాజీ ప్రధాని, మాజీ క్రికెట్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు దేశవ్యాప్తంగా విధ్వంసం, హింసకు పాల్పడ్డారు. మరోవైపు అనేక చోట్ల షియా-సున్నీ ఘర్షణల్లో డజన్ల కొద్దీ ప్రజలు మరణించారు. దీంతో పలు క్రికెట్ ఆడే దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) ఇప్పటికే తమ జట్టును పాకిస్థాన్‌కు పంపబోమని ప్రకటించగా.. శ్రీలంక-ఎ జట్టును కూడా తమ దేశం పాకిస్థాన్ నుంచి వెనక్కి పిలిపించింది. దీంతో పాక్ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యాన్ని ఉపసంహరించుకోవాలని చర్చలు జరుగుతున్నాయి. దీనిపై తుది నిర్ణయం తీసుకోవడానికి శుక్రవారం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బోర్డు సమావేశం నిర్వహించగా.. చివరి క్షణంలో ఈ సమావేశం శనివారానికి వాయిదా పడింది. మరోవైపు బీసీసీఐ తర్వాత శుక్రవారం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా పాకిస్థాన్‌లో పరిస్థితిపై నిర్మొహమాటంగా ఆందోళన వ్యక్తం చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా పాకిస్థాన్‌కు వెళ్లే అవకాశం లేదని పేర్కొంది.

పాకిస్థాన్ ఆతిథ్యంపై అనుమానాలు కొనసాగుతున్నాయి

పాకిస్థాన్‌లో పరిస్థితులు దిగజారడం, బీసీసీఐ అక్కడ ఆడేందుకు నిరాకరించడంతో శుక్రవారం మధ్యాహ్నం 4 గంటలకు ఐసీసీ అత్యవసర బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి బీసీసీఐ, పీసీబీ కూడా హాజరు కావాల్సి ఉంది. ఈ సమావేశంలో ICC సభ్యులందరినీ హైబ్రిడ్ మోడల్‌పై ఓటు వేయమని కోరాల‌నుకుంది. హైబ్రిడ్ మోడల్‌లో కొన్ని మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో, మరికొన్ని మ్యాచ్‌లు వేరే దేశంలో జరగాల్సి ఉంది. దీనితో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్యాన్ని పాకిస్తాన్ నుండి పూర్తిగా తొల‌గించాల‌ని కూడా నిర్ణ‌యించారు. అయితే ఐసీసీ బోర్డు సమావేశం అకస్మాత్తుగా వాయిదా పడడంతో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోవడంతో పాకిస్థాన్ ఆతిథ్యంపై అనుమానం శనివారం వరకు కొనసాగనుంది.

Also Read: Team India New ODI Jersey: టీమిండియా కొత్త జెర్సీ విడుద‌ల‌.. ఈ జెర్సీ ప్రత్యేకత ఏమిటంటే..?

సభ కొన్ని నిమిషాల పాటు కొనసాగి వాయిదా పడింది

ICC అత్యవసర బోర్డు సమావేశం శుక్రవారం కొన్ని నిమిషాల పాటు జరిగింది. అయితే దీని తరువాత అది అకస్మాత్తుగా శనివారం (నవంబర్ 30)కి వాయిదా పడింది. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై వివాదానికి పరిష్కారం కనుగొనడానికి ఐసిసి ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి)తో మాట్లాడిందని, అయితే దాని అధికారిక ప్రకటన ఆలస్యం అవుతుందని రిపబ్లిక్ నివేదిక పేర్కొంది. టోర్నమెంట్‌ను హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహించాలనే సూచనను పాకిస్తాన్ తిరస్కరించిందని, ఎందుకంటే ఆతిథ్యం కోసం వచ్చే భారీ మొత్తాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని నివేదిక పేర్కొంది.

జై షా ప్రభావం చూపించారా?

బీసీసీఐ కార్యదర్శి జై షా డిసెంబర్ 1న అంటే ఆదివారం ఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. హైబ్రిడ్ మోడల్‌కు సిద్ధమయ్యేలా పాకిస్థాన్‌పై ఒత్తిడి తెచ్చేలా ఐసీసీ బోర్డు సమావేశాన్ని వాయిదా వేయడం ద్వారా అధ్యక్షుడిగా కాకముందే తన ప్రభావాన్ని చూపించినట్లు కూడా చర్చ జరుగుతోంది. టీమ్ ఇండియా పాకిస్థాన్‌కు వెళుతుందా లేదా అనే ప్రశ్నలకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం సమాధానం ఇచ్చింది. రోజువారీ విలేకరుల సమావేశంలో ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన ప్రశ్నను అడిగినప్పుడు.. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ సింగ్ మాట్లాడుతూ.. టీమిండియా పాకిస్థాన్‌కు వెళ్లే అవకాశం లేదు. అక్కడ (పాకిస్థాన్‌లో) భద్రతాపరమైన సమస్యలు ఉన్నాయని బీసీసీఐ ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేసింది. అందువల్ల టీమ్ ఇండియా అక్కడికి వెళ్లే అవకాశం లేదని తెలిపారు.