Site icon HashtagU Telugu

Abhishek Sharma : పాపం అభిషేక్ శర్మ…డక్ తో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభం

Abhishek Sharma

Abhishek Sharma

అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ను యువ ఆటగాడు అభిషేక్ శర్మ (Abhishek Sharma) డక్ తో ప్రారంభించాడు. జింబాబ్వే(Zimbabwe)తో తొలి టీ ట్వంటీ(T20I )లో అభిషేక్ పరుగులేమీ చేయకుండానే ఔటయ్యాడు. ఓపెనర్ గా గిల్ తో కలిసి బరిలోకి దిగిన ఈ యువ ఆటగాడు మొదటి ఓవర్ నాలుగో బంతికి వెనుదిరిగాడు. బ్రయాన్ బెన్నెట్ బౌలింగ్ లో మసకద్జకు క్యాచ్ ఇచ్చి డకౌటయ్యాడు. ఈ మ్యాచ్ తో అభిషేక్ శర్మతో పాటు రియాన్ పరాగ్ , ధృవ్ జురెల్ అరంగేట్రం చేశారు. అభిషేక్ , పరాగ్ లకు భారత్ తరపున ఆడడం ఇదే తొలిసారి కాగా టెస్టుల్లో ఇప్పటికే కెరీర్ ఆరంభించిన ధృవ్ జురెల్ టీ ట్వంటీల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఈ ముగ్గురూ భారత్ తాత్కాలిక కోచ్ వీవీయస్ లక్ష్మణ్, స‌పోర్ట్ స్టాప్ చేతుల మీదగా అరంగేట్ర క్యాప్‌ను అందుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా ఈ ముగ్గురు యువ ఆట‌గాళ్లు ఐపీఎల్‌ 17వ సీజన్ ( IPL 17th Season) లో అదరగొట్టేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అభిషేక్ శర్మ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో పరుగుల వరద పారించాడు. ఐపీఎల్ చరిత్రలోనే సన్‌రైజర్స్ భారీ స్కోర్ చేయడంలో అభిషేక్‌ కీలక పాత్ర పోషించాడు. ఈ సీజ‌న్‌లో 16 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన అభిషేక్‌ శర్మ 32.27 స‌గ‌టుతో 484 పరుగులు చేశాడు. మరోవైపు ప‌రాగ్ కూడా అంద‌రిని ఆక‌ట్టుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ కు ఆడుతున్న పరాగ్ 16 మ్యాచ్‌లలో 52.09 స‌గ‌టుతో 573 పరుగులు చేశాడు.

ఈ ఏడాది ఐపీఎల్‌లో రాజస్తాన్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలోనే సెలక్టర్లు వీరిద్దరికీ పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే ఇప్పటికే టెస్ట్ క్రికెట్ కెరీర్ ఆరంభంలోనే ఆకట్టుకున్న ధృవ్ జురెల్ కు కూడా సెలక్టర్లు టీ ట్వంటీల్లోకి పిలుపునిచ్చారు. దేశవాళీ టీ ట్వంటీ క్రికెట్ లో జురెల్ కు అద్భుతమైన రికార్డుంది. కాగా జింబాబ్వేతో తొలి టీ ట్వంటీ భారత బౌలర్లు అదరగొట్టారు. స్పిన్నర్ రవి బిష్ణోయ్ మ్యాజిక్ కు జింబాబ్వే 115 పరుగులకే ఆలౌటైంది. రవి బిష్ణోయ్ 4 ఓవర్లలో 13 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దీనిలో రెండు మెయిడెన్లు ఉన్నాయి.

Read Also : Pawan Kalyan : ద్వారంపూడికి దడ పుట్టిస్తున్న పవన్ కళ్యాణ్