IND vs ZIM 2nd T20: కెరీర్ తొలి మ్యాచ్ లో డకౌట్ అయ్యానన్న కసితో ఉన్న యువ ఓపెనర్ అభిషేక్ శర్మ రెండో టీ ట్వంటీలో రెచ్చిపోయాడు. జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపిస్తూ సెంచరీతో కదం తొక్కాడు. ఆడుతున్న రెండో మ్యాచ్ లోనే శతకం సాధించిన క్రికెటర్ గా రికార్డ్ సృష్టించాడు. హాఫ్ సెంచరీని 33 బంతుల్లో పూర్తి చేసుకున్న అభిషేక్ శర్మ తర్వాత 50 పరుగులను 13 బంతుల్లోనే అందుకున్నాడంటే ఎలా విరుచుకుపడ్డాడో అర్థం చేసుకోవచ్చు. 11వ ఓవర్ లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో కలిసి 26 పరుగులు బాదాడు. సిక్సర్ తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న ఈ యువ ఓపెనర్ సెంచరీని కూడా సిక్సర్ తోనే చేశాడు. అభిషేక్ శర్మ కేవలం 47 బంతుల్లోనే 8 సిక్సర్లు, 7 ఫోర్లతో 100 పరుగులు చేసి ఔటయ్యాడు. అభిషేక్ విధ్వంసంతో రెండో టీ ట్వంటీలో భారత్ భారీస్కోర్ చేసింది.
ఐపీఎల్ లో పరుగుల వరద పారించడంతో అభిషేక్ శర్మకు సెలక్టర్లు పిలుపునిచ్చారు. సన్ రైజర్స్ తరఫున ఆడిన ఈ యువ ఓపెనర్ ఐపీఎల్ 17వ సీజన్ లో అదరగొట్టాడు. 16 మ్యాచ్ లలో ఏకంగా 204.22 స్ట్రైక్ రేట్ తో 484 రన్స్ చేశాడు. అయితే తొలి టీ ట్వంటీలో మాత్రం డకౌటై నిరాశపరిచాడు. అయితే 24 గంటల్లోనే ఆ నిరాశ నుంచి కోలుకుని సెంచరీతో చెలరేగిపోయాడు. ఈ శతకంతో అభిషేక్ శర్మ పలు రికార్డులు నెలకొల్పాడు. ఈ ఏడాది అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ గా రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేశాడు. ఓవరాల్ గా ఐపీఎల్ , అంతర్జాతీయ క్రికెట్ కలిసి ఈ ఏడాది రోహిత్ ఇప్పటి వరకూ 46 సిక్సర్లు బాదితే.. అభిషేక్ దానిని అధిగమించాడు. అలాగే అత్యంత వేగంగా టీ ట్వంటీల్లో సెంచరీ చేసిన నాలుగో భారత క్రికెటర్ గానూ రికార్డులకెక్కాడు. ఇక రెండో మ్యాచ్ లోనే టీ ట్వంటీ శతకం సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గతంలో దీపక్ హుడా మూడు మ్యాచ్ లు ఆడి శతకం చేస్తే ఇప్పుడు ఆ రికార్డును అభిషేక్ శర్మ బద్దలుకొట్టాడు.
Also Read: Sonia Gandhi : వైఎస్సార్ జయంతి వేళ సోనియాగాంధీ కీలక సందేశం.. షర్మిల థ్యాంక్స్