Asia Cup 2025: సెప్టెంబర్ 9 నుండి యూఏఈలో ప్రారంభం కానున్న ఆసియా కప్ 2025 (Asia Cup 2025) కోసం భారత జట్టు ఎంపిక క్రికెట్ అభిమానులలో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అయితే జట్టు కూర్పు విషయంలో బీసీసీఐకి పెద్ద సవాల్ ఎదురవుతోంది. ప్రస్తుత ఆటగాళ్ల ఫామ్, ఫిట్‌నెస్, జట్టు సమతూకాన్ని పరిగణనలోకి తీసుకుంటే దాదాపు 9 మంది కీలక ఆటగాళ్లకు ఈసారి జట్టులో చోటు దక్కడం కష్టమేనని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
శుభ్‌మన్ గిల్- యశస్వి జైస్వాల్‌పై సందిగ్ధత
ఓపెనర్ల స్థానం కోసం టీమ్ ఇండియాలో ప్రస్తుతం తీవ్రమైన పోటీ నెలకొంది. ఇటీవల కాలంలో టీ20 ఫార్మాట్‌లో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ అద్భుతమైన ప్రదర్శనతో తమ స్థానాలను దాదాపు పదిలపరుచుకున్నారు. దీంతో టెస్ట్ స్పెషలిస్టులుగా మారిన శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌లకు టీ20 జట్టులో చోటు దక్కడం కష్టమని భావిస్తున్నారు.
శుభ్‌మన్ గిల్ టెస్ట్ కెప్టెన్‌గా ఉన్నప్పటికీ టీ20 ఫార్మాట్‌లో అతని వేగం, స్ట్రైక్ రేట్ అంతగా ఆకట్టుకోవడం లేదు. మరోవైపు యశస్వి జైస్వాల్ అద్భుతమైన బ్యాట్స్‌మెన్ అయినప్పటికీ పోటీ ఎక్కువగా ఉండటంతో అతనికి కూడా చోటు కష్టంగానే ఉంది. సెలెక్షన్ కమిటీ యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనుకుంటే, ఈ ఇద్దరు స్టార్‌లను పక్కన పెట్టే అవకాశం ఉంది.
Also Read: First Pregnancy Robot: పిల్లలను కనే రోబో.. 9 నెలల్లో డెలివరీ, ధర ఎంతంటే?
పైన పేర్కొన్న ఇద్దరితో పాటు మరో ఏడుగురు ఆటగాళ్లకు కూడా ఆసియా కప్ జట్టులో చోటు దక్కకపోవచ్చు.
- కేఎల్ రాహుల్: నిలకడ లేని ఫామ్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా సంజూ శాంసన్ వంటి యువ ఆటగాళ్ల రాకతో రాహుల్‌కు జట్టులో స్థానం దక్కడం కష్టంగా మారింది.
- రిషభ్ పంత్: ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదవ టెస్ట్ మ్యాచ్‌లో గాయపడినందున పంత్ ఫిట్‌నెస్ గురించి ఇంకా స్పష్టత లేదు. పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోతే అతనిని పరిగణనలోకి తీసుకోకపోవచ్చు.
- శార్దూల్ ఠాకూర్: ఆల్-రౌండర్‌గా శార్దూల్ బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. దీంతో అతను కూడా రేసులో వెనకబడ్డాడు.
- ఇషాన్ కిషన్: బ్యాటింగ్‌లో ఫామ్ లేకపోవడంతో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ స్థానం కోసం సంజూ శాంసన్, జితేశ్ శర్మ వంటి ఆటగాళ్లతో పోటీ పడటం అతనికి కష్టంగా మారింది.
- శివమ్ దూబే: ఆల్‌రౌండర్‌గా దూబే ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. దీంతో అతనికి కూడా జట్టులో చోటు దక్కకపోవచ్చు.
- ఆకాశ్‌దీప్: ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో సిరాజ్, బుమ్రా, అర్షదీప్, హర్షిత్ రాణా వంటి ఆటగాళ్లు ఉండటంతో ఆకాశ్‌దీప్‌కు జట్టులో స్థానం దక్కడం కష్టంగా ఉంది.
- ధ్రువ్ జురెల్: యువ వికెట్ కీపర్ అయిన జురెల్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ సంజూ శాంసన్, జితేష్ శర్మల కారణంగా అతనికి అవకాశం దొరకకపోవచ్చు.