IPL 2026: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ మార్చి 28 నుండి ప్రారంభం కానుంది. ఈసారి టోర్నమెంట్ కేవలం ఆటగాళ్ల ప్రదర్శనతోనే కాకుండా, బీసీసీఐ ప్రవేశపెట్టిన కొన్ని విప్లవాత్మకమైన కొత్త నిబంధనలతో మరింత ఉత్సాహంగా సాగనుంది. ఆటను మరింత వేగంగా, పారదర్శక నిబంధనలతో నిర్వహించేందుకు ఈ మార్పులు చేశారు.
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కొనసాగింపు
గత రెండు సీజన్లలో ఎంతో చర్చకు దారితీసిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధన ఈసారి కూడా అందుబాటులో ఉంటుంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ నిబంధన 2027 సీజన్ వరకు కొనసాగుతుంది. దీనివల్ల జట్లు టాస్ తర్వాత కూడా తమ వ్యూహాలను మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇది మ్యాచ్ ఫలితాలను ప్రభావితం చేసే కీలక అంశంగా మారింది.
Also Read: భారతీయ రైల్వే కవచ్.. 160 కిలోమీటర్ల వేగంతోనూ సురక్షితం!
ఓవర్‌కు రెండు కొత్త బంతులు, డ్యూ ఫ్యాక్టర్
మ్యాచ్‌ల్లో ‘మంచు’ ప్రభావాన్ని తగ్గించడానికి ఈసారి సరికొత్త ప్రయోగం చేయనున్నారు. ఇన్నింగ్స్ మధ్యలో అంటే 11వ ఓవర్ తర్వాత బంతిని మార్చే అవకాశం ఉంటుంది. దీనికోసం రెండు కొత్త బంతులను సిద్ధంగా ఉంచుతారు. దీనివల్ల బౌలర్లకు బంతిపై పట్టు దొరుకుతుంది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్ బౌలింగ్ చేసే జట్లకు ఇది పెద్ద ఊరటనిస్తుంది.
వైడ్, నో-బాల్స్ కోసం DRS
అంపైర్ల నిర్ణయాల్లో తప్పులు దొర్లకుండా ఉండేందుకు, వైడ్ బాల్, నో-బాల్ నిర్ణయాలకు కూడా DRS (Decision Review System)ను అనుమతించారు. ఈ సౌకర్యాన్ని అటు బ్యాటింగ్ చేస్తున్న జట్టు, ఇటు బౌలింగ్ చేస్తున్న జట్టు ఇద్దరూ ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల మైదానంలో అనవసరపు వాదోపవాదాలు తగ్గి, ఆట పారదర్శకంగా సాగుతుంది.
స్లో ఓవర్ రేట్ నిబంధనలో మార్పు
ఐపీఎల్ 2026లో అతిపెద్ద మార్పు స్లో ఓవర్ రేట్ నియమంలో జరిగింది. గతంలో నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోతే కెప్టెన్‌పై జరిమానా లేదా తదుపరి మ్యాచ్ నుంచి నిషేధం విధించేవారు. కానీ ఇప్పుడు స్లో ఓవర్ రేట్ కారణంగా ఏ ఆటగాడినీ నిషేధించరు. అయితే దీనికి బదులుగా భారీ జరిమానాలు లేదా మ్యాచ్ సమయంలో ఫీల్డింగ్ పరిమితుల రూపంలో శిక్షలు ఉండవచ్చు.
