Site icon HashtagU Telugu

Wind man of India : గుండెపోటుతో ‘విండ్‌మ్యాన్ ఆఫ్‌ ఇండియా’ తులసీ తాంతీ మృతి..!!

Tulasi Thanthi

Tulasi Thanthi

ప్రముఖ ఇంధన సంస్థ సుజ్లాన్‌ ఎనర్జీ వ్యవస్థాపకుడు తులసీ తాంతీ (64) మృతిచెందారు. గుండెపోటుతో ఆయన శనివారం మృతిచెందిన‌ట్లు కంపెనీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. శ‌నివారం అహ్మదాబాద్‌లో జరిగిన ఓ కార్య‌క్ర‌మం నుంచి వ‌చ్చిన‌ ఆయన పుణెలో ఉండగా ఛాతిలో నొప్పిగా ఉన్నట్లు డ్రైవర్‌కు చెప్పారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని డ్రైవ‌ర్‌ను సూచించారు. అక్కడికి చేరుకునే లోపే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారని ప్ర‌ముఖ వార్తా సంస్థ‌లు పేర్కొన్నాయి. ఆయనకు భార్య గీత, కుమారుడు ప్రణవ్‌, కుమార్తె నిధి ఉన్నారు.

మన దేశంలో పవన విద్యుదుత్పత్తి రంగంలో ఉన్న అవకాశాల్ని చాటిచెప్పిన తాంతీని భారత ‘విండ్‌ మ్యాన్‌’గా వ్యవహరిస్తుంటారు. సుజ్లాన్‌ ఎనర్జీని 1995లో స్థాపించి త‌క్కువ కాలంలోనే దాన్ని గ్లోబల్‌ సంస్థలతో పోటీపడేలా తీర్చిదిద్దారు. 1958లో రాజ్‌కోట్‌లో జన్మించిన తాంతీ గుజరాత్ విశ్వవిద్యాలయం నుండి కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. అతను 1995లో సుజ్లాన్ ఎనర్జీని స్థాపించాడు. ఇప్పుడు దాని విలువ రూ. 8,535.9 కోట్లు. తాంతీ.. బెల్జియం ఆధారిత టర్బైన్ విడిభాగాల తయారీదారు ZF విండ్ పవర్ ఆంట్వెర్పెన్‌కు ఛైర్మన్‌గా, ఇండియన్ విండ్ టర్బైన్ తయారీదారుల సంఘం అధ్యక్షుడిగా కూడా ప‌ని చేశారు.

తాంతీ మరణంపై ప్రధానమంత్రి మోదీ సహా పలువురు వ్యాపారస్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘తులసీ తాంతీ గొప్ప దార్శనికుడు. దేశ ఆర్థిక ప్రగతికి ఆయన ఎంతో కృషి చేశారు. భారత సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో తోడ్పాటునందించారు. ఆయన అకాల మరణం నన్ను కలచివేసింది. ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని మోదీ ట్వీట్‌ చేశారు.