Wife Property Right : గృహిణిగా ఉన్నా.. భర్త సంపాదనతో కొన్న కుటుంబ ఆస్తుల్లో భార్య కూడా సమాన హక్కుదారే అంటూ మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భార్య దశాబ్దాల పాటు ఇంట్లో పనులు చేస్తూ.. పిల్లలను సరిగ్గా చూసుకున్నప్పుడే భర్త బయటికెళ్లి సంపాదించగలుగుతాడని, అందుకే కుటుంబ ఆస్తులకు ఇద్దరూ సమాన వాటాకు హక్కుదారులని జస్టిస్ కృష్ణన్ రామసామి స్పష్టం చేశారు. భార్య చేసే త్యాగానికి ఎలాంటి పరిమితి లేదని, న్యాయమూర్తులు దాన్ని గుర్తించకుండా ఏ చట్టమూ నిరోధించజాలదని చెప్పారు. ఓ జంటకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా జస్టిస్ కృష్ణన్ రామసామి ఈ వ్యాఖ్యలు చేశారు.
అసలు కేసు ఇది..
కన్నయన్ నాయుడు విదేశాల్లో పనిచేసి సంపాదించిన డబ్బుతో 2002లో కొన్ని ఆస్తులను కొన్నాడు. తర్వాత దారి తప్పిన నాయుడు ఆస్తులను అన్యాక్రాంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని, ఆ ఆస్తులను కాపాడాలంటూ అతడి భార్య కోర్టును ఆశ్రయించింది. కానీ.. తాను విదేశాల్లో ఉన్నప్పుడు సంపాదించిన డబ్బుతో కొన్నానని, ఆ ఆస్తిపై తనకే పూర్తి హక్కు ఉందంటూ నాయుడు వాదించాడు.
Also read : 1975 Emergency Pension :ఎమర్జెన్సీని ఎదిరించిన యోధులకు నెలకు రూ.15వేల పింఛను
కానీ.. తన భర్త విదేశాలకు వెళ్లడంతో తాను తన పని మానేసి పిల్లలను, ఇంటి పనులకే పూర్తి సమయం కేటాయించానని, ఆ ఆస్తిలో తనకూ వాటా దక్కాల్సిందేనని నాయుడు భార్య వాదించింది.తన భర్త విదేశాలకు వెళ్లేందుకు తన పూర్వీకుల ఆస్తిని అమ్మేశానని, అతడు డబ్బులు పంపించే వరకు తాను టైలరింగ్, ట్యూషన్ ద్వారా కుటుంబాన్ని పోషించానని నాయుడు భార్య వివరించింది. ఈ వాదనలు విన్న జస్టిస్ రామసామి.. సాధారణంగా భార్య పిల్లలను కని, పెంచి, పోషిస్తుందని, ఇంటి పనులు చేస్తుందని, ఆమె ఆ పనులు సజావుగా చేస్తేనే భర్త బయటికెళ్లి సంపాదించగలడని, కాబట్టి అతడి ఆస్తిలో సమాన వాటాకు(Wife Property Right) భార్య అర్హురాలని స్పష్టం చేశారు.