79th Independence Day : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన వేడుకలో ఆయన మాట్లాడుతూ..మేము అహింసా మార్గంలో మహా సంగ్రామాన్ని గెలిచాం. భారత స్వాతంత్ర్య పోరాటం ప్రపంచానికి సరికొత్త మార్గాన్ని చూపించింది.అని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో దేశానికి ప్రేరణగా నిలిచిన జవహర్‌లాల్ నెహ్రూ ప్రసంగాన్ని స్మరించుకున్నారు. 1947 ఆగస్టు 15న నెహ్రూ చేసిన ప్రసంగం దేశాన్ని ఏకం చేసింది. నెహ్రూ కేవలం మాటలకే పరిమితం కాలేదు, ఆయన చర్యలతో భారత భవిష్యత్‌కు బలమైన పునాది వేశారు అని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధిపై మాట్లాడుతూ..మహనీయుల స్ఫూర్తితో తెలంగాణను అగ్రపథంలో నిలిపేందుకు కృషి చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ధైర్యంగా, ప్రజల ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రపంచ నగరాలకు పోటీగా ముందుకు వెళ్తున్నాం. పేదల సంక్షేమంలో విప్లవాత్మక చరిత్ర రాస్తున్నాం అని పేర్కొన్నారు.
పేదల సంక్షేమం, రేషన్ వ్యవస్థపై విశేషాలు
సీఎం వివరిస్తూ, దేశవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు. ఇది కేవలం ఆకలిని తీరుస్తున్న పథకం కాకుండా, పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా అభివర్ణించారు. “రేషన్ షాపులు ఇప్పుడు పేదలకు భరోసా కేంద్రాలుగా మారాయి. ప్రజాప్రభుత్వం వచ్చాకే పేదల సమస్యలకు పరిష్కారాలు కనబడుతున్నాయి” అన్నారు.
రైతుల పట్ల సంకల్పంతో కూడిన చర్యలు
గత ఏడాది ప్రకటించిన రూ.2 లక్షల రుణమాఫీ పథకాన్ని అమలుచేశామని, విత్తనాలు వేసే నాటికి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసినట్లు తెలిపారు. పరిమితులు లేకుండా 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేసాం. ధాన్యం విక్రయించిన 48 మంది రైతులకు వెంటనే చెల్లింపులు చేశాం అని వివరించారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా 78 లక్షల వ్యవసాయ మోటార్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, రైతులు అన్నపూర్ణులుగా నిలిచేలా ప్రభుత్వం అండగా ఉందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీరు రాకపోయినా ధాన్య దిగుబడుల్లో రికార్డు సాధించాం అని గుర్తుచేశారు.
జలాల విషయంలో స్పష్టమైన స్థానం
గోదావరి, కృష్ణా జలాలపై మాట్లాడుతూ..మన వాటా సాధించేవరకు రాజీకి తావు లేదు. భూములు సస్యశ్యామలం అయిన తర్వాతే మరొకరికి నీళ్లు ఇవ్వాలా అన్నది ఆలోచిస్తాం. నెహ్రూ నిర్మించిన సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల ద్వారానే నీటి వనరులు అందుతున్నాయి అని చెప్పారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, కాళేశ్వరం పేరిట లక్షల కోట్లు గోదావరిలో వేసి ఇప్పుడు మళ్లీ సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారు అని మండిపడ్డారు.
హైదరాబాద్ అభివృద్ధి – గ్లోబల్ బ్రాండ్‌గా మలుస్తాం
హైదరాబాద్ శతాబ్దాల నుంచే ఒక బ్రాండ్. ఇప్పుడు దాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్తున్నాం అని వెల్లడించారు. ఇటీవల జరిగిన ప్రపంచ సుందరీమణుల పోటీలకు హైదరాబాద్ వేదికగా మారడం, ఆ అవకాశంలో తెలంగాణ సంస్కృతి, ప్రత్యేకతలు ఆవిష్కరించగలగడం గర్వకారణంగా పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీలో 200 ఎకరాల్లో AI సిటీకి భూమిని కేటాయించాం. బయో ఏసియా సదస్సు ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించాం. ఫార్మా కంపెనీలు ప్రపంచానికి ఆదర్శంగా మారాయి అని సీఎం వివరించారు. సంపూర్ణంగా తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తమ ప్రభుత్వ కృషిపై విశ్వాసం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పబలంతో ముందుకు సాగుతోంది. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.