Maharashtra Violence: మహారాష్ట్రలో రెండు గ్రూపులు మధ్య చెలరేగిన వివాదం తారాస్థాయికి చేరింది. ఇరు వర్గాలు రాళ్లతో దాడి చేసుకోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్, అకోలా నగరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి ఘటన అహ్మద్‌నగర్‌లోని షెవ్‌గావ్ పట్టణంలో వెలుగు చూసింది. అదే సమయంలో అకోలాలో చిన్నపాటి వివాదంతో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ రెండు ఘటనల్లోనూ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ఈ హింసాత్మక ఘర్షణలో పలువురు గాయపడినట్లు సమాచారం. అదే సమయంలో ఘర్షణకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
మే 14వ తేదీ రాత్రి అహ్మద్‌నగర్‌లోని షెవ్‌గావ్‌లో ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. వాస్తవానికి ఛత్రపతి శంభాజీ మహరాజ్ జయంతి సందర్భంగా, రాత్రి 8 గంటలకు ఊరేగింపు బయలుదేరింది. ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక గుంపు రాళ్లు రువ్వింది. మొదట మతపరమైన స్థలంపై రాళ్లతో కొట్టారు. దీంతో ఇరువైపులా రాళ్లదాడి మొదలైంది.
మే 13న అకోలాలో చిన్న వివాదంపై రెండు గ్రూపుల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది. ఈ హింసాకాండలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అకోలాలో 144 సెక్షన్ విధించారు. ఇంటర్నెట్‌ను కూడా నిలిపివేశారు.
ఈ గందరగోళం మధ్య ప్రజలు తమ దుకాణాలను మూసివేయవలసి వచ్చింది. ఘర్షణలో పాల్గొన్న కొందరు ఆకతాయిలు పలు దుకాణాలపై దాడి చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు 102 మందిపై కేసులు నమోదు చేశారు.
Read More: Dhoni Autograph: ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకున్న భారత క్రికెట్ లెజెండ్