Vijay Mallya : దాదాపు రూ.9,000 కోట్లకు పైగా మోసపూరిత రుణాలు, మనీలాండరింగ్ ఆరోపణలతో భారత్‌లో న్యాయపరంగా ఎదురయ్యే సమస్యల నేపథ్యంలో వాంఛితుడిగా ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా మరోసారి వార్తల్లోకి వచ్చారు. పారిశ్రామికవేత్త రాజ్ షమానీతో నిర్వహించిన నాలుగు గంటల పొడవైన పాడ్‌కాస్ట్‌లో మాల్యా తనపై ఉన్న ఆరోపణలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. 2016లో భారత్ విడిచి వెళ్లిన తర్వాత తిరిగి రాలేదన్న అంశంపై స్పందిస్తూ.. “మీరు నన్ను పరారీలో ఉన్న వ్యక్తిగా పిలవొచ్చు, ఎందుకంటే నేను తిరిగి వెళ్లలేదు. కానీ పారిపోలేదని స్పష్టంగా చెబుతున్నా. ముందే నిర్ణయించిన పర్యటనల కోణంలోనే దేశం విడిచాను. ‘దొంగ’ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావడం లేదు. నేను ఏ దొంగతనమూ చేయలేదు” అని మాల్యా పేర్కొన్నారు.
Revanth Cabinet Decisions : క్యాబినెట్ నిర్ణయాలపై హరీశ్‌రావు ఆగ్రహం
తనపై ఉన్న కేసులకు సంబంధించి న్యాయపరమైన హామీ ఉంటే భారత్‌కు తిరిగి వెళ్తానని ఆయన వ్యాఖ్యానించారు. “నాకు భారత న్యాయ వ్యవస్థపై గౌరవం ఉంది. కానీ గౌరవప్రదమైన విచారణ జరుగుతుందన్న హామీ అవసరం. యూకే హైకోర్టు ఇప్పటికే భారత జైళ్ల పరిస్థితులు మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొంది. అలాంటప్పుడు వెనక్కి రావడం ఎలా?” అని ప్రశ్నించారు.
2008లో ప్రారంభమైన ప్రపంచ ఆర్థిక మాంద్యం కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పతనానికి కారణమని ఆయన చెప్పారు. “ఆ సమయంలో విమానాల సంఖ్య తగ్గించాలి, ఖర్చులు కట్టడి చేయాలి అని కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీని కలిశాను. కానీ ఆయన ‘బ్యాంకులు మద్దతిస్తాయి’ అని చెప్పారు. అదే సమయంలో రూపాయి విలువ పడిపోయింది, ఫండింగ్ నిలిచిపోయింది. అంతిమంగా కింగ్ ఫిషర్ సేవలు నిలిచిపోయాయి” అని వివరించారు.
లండన్ హైకోర్టులో దాఖలైన దివాలా కేసులో ఈ ఏడాది ఏప్రిల్‌లో మాల్యా అప్పీల్ కోల్పోయారు. భారతీయ బ్యాంకులు కలిసిన కన్సార్టియం రూ.11,101 కోట్లు తిరిగి పొందాల్సి ఉండగా.. ఇప్పటికే రూ.14,000 కోట్లు రాబట్టారని మాల్యా వాదిస్తున్నారు. దీనిపై కర్ణాటక హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అయినా భారత ప్రభుత్వం ఆయనను తీసుకురావడానికి ఎప్పటికప్పుడు కసరత్తు చేస్తూనే ఉంది. విజయ్ మాల్యా ఈ ఇంటర్వ్యూలో తనపై ఉన్న వివాదాలపై తన మౌనాన్ని తొలగిస్తూ స్పందించటం, భారత ప్రభుత్వానికి మరోసారి సవాల్ విసిరినట్టే కనిపిస్తోంది.
Revanth Cabinet Decisions : క్యాబినెట్ నిర్ణయాలపై హరీశ్‌రావు ఆగ్రహం