Results: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల.. టాపర్స్ వీళ్లే..!

తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EAMCET) 2023 ఫలితాలు (Results) గురువారం విడుదలయ్యాయి.

  • Written By:
  • Updated On - May 25, 2023 / 01:31 PM IST

Results: తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EAMCET) 2023 ఫలితాలు (Results) గురువారం విడుదలయ్యాయి. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో 80.33 శాతం అర్హత సాధించగా, 86.31 శాతం మంది అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో ఉత్తీర్ణత సాధించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ప్రకటించిన ఫలితాలను https://eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. మొత్తం 1,95,275 మంది విద్యార్థులు ఇంజినీరింగ్ పరీక్షకు హాజరుకాగా 80.33 శాతం మంది అర్హత సాధించారు. అగ్రికల్చర్ స్ట్రీమ్ పరీక్షకు హాజరైన 1,06,514 మంది అభ్యర్థుల్లో 86.31 శాతం మంది అర్హత సాధించారు.

Also Read: BRS Lose: ఆ ఎమ్మెల్యేలకు టికెట్స్ ఇస్తే.. 14 సీట్లు ఓడిపోవడం పక్కా!

ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్ స్ట్రీమ్‌ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు అగ్రస్థానంలో నిలిచారు. ఇంజినీరింగ్‌లో విశాఖపట్నానికి చెందిన ఎం. ధీరజ్ టాపర్‌గా నిలవగా, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బి. సత్య ఏఎం స్ట్రీమ్‌లో మొదటి ర్యాంక్ సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో బాలికలు 82 శాతం మంది, బాలురు 79 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక అగ్రికల్చర్ విభాగంలో చూస్తే బాలికలు 87 శాతం, బాలురు 84 శాతం మంది పాస్ అయ్యారని వెల్లడించారు. జూన్ లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. స్థానికత కలిగిన అభ్యర్థులకు 85 శాతం సీట్లను కేటాయించనున్నట్లు తెలిపారు.

ఇక ఈ ఏడాది నిర్వహించిన తెలంగాణ ఎంసెట్ పరీక్షలకు మొత్తం 94.11 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 3,20,683 దరఖాస్తులు రాగా, వీటిలో 3,01,789 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో తెలంగాణ నుంచి 2,48,279 మంది దరఖాస్తు చేసుకోగా 2,35,918 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు.