Tomato-Rs100 : సెంచరీ దిశగా టమాటా.. సామాన్యులకు దడ

Tomato-Rs100 : టమాటా రేట్ల పెరుగుదల ఆగడం లేదు.. దీంతో సామాన్యులకు ధరల దడ మొదలైంది.

  • Written By:
  • Updated On - June 27, 2023 / 11:16 AM IST

Tomato-Rs100 : టమాటా రేట్ల పెరుగుదల ఆగడం లేదు.. 

దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో రూ.100 దిశగా టమాటా రేట్లు పరుగు తీస్తున్నాయి.. 

త్వరలో తెలంగాణ, ఏపీ, ఢిల్లీ, కర్ణాటకలలో కేజీ టమాటా ధర రూ.100కు చేరొచ్చని భావిస్తున్నారు.. 

గత వారం రోజుల వ్యవధిలో ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మార్కెట్‌లో టమాటా ధరలు డబుల్ అయ్యాయి. ఇప్పుడు అక్కడ కేజీ టమాటాను రూ.80కి అమ్ముతున్నారు. 15 కేజీల హోల్ సేల్  టమాటా పెట్టెను రూ.1100కి సేల్ చేస్తున్నారు.  అంటే హోల్ సేల్ రేటే రూ.75కు పైబడి ఉంది. దాన్ని రీటైల్ వ్యాపారులు రవాణా ఖర్చులు, తరుగు, లాభం కలుపుకొని రూ.80 నుంచి రూ.85 దాకా సాధారణ వినియోగదారులకు అమ్ముతున్నారు. మార్కెట్ కు టమాటా సప్లై తక్కువగా ఉన్నందున రానున్న రోజుల్లో టమాటా రేటు రెక్కలు తొడిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో టమాటా ధరలు ఆకాశాన్ని అంటడానికి కారణం హర్యానా, ఉత్తరప్రదేశ్‌ సహా పలు పొరుగు రాష్ట్రాల నుంచి టమాటా సప్లై తగ్గిపోవడమే!!

Also read : Alcohol Effects: అతిగా తాగితే అనర్ధమే.. మద్యంతో ముసలితనం వస్తుందట!

టమాటా సాగు జరిగే ప్రాంతాల్లో కరువు పరిస్థితులు రైతులను బాగా దెబ్బతీశాయి. దీంతో టమాటా సాగు భారీగా జరిగే ఉత్తర ప్రదేశ్ లో కూడా టమాటా ధర కిలో రూ.80 పలుకుతోంది. పంజాబ్‌లో కిలో టమాటా  ధర రూ. 60కి చేరుకుంది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో టమాటా ఇప్పుడు కిలోకు రూ.65 చొప్పున విక్రయిస్తున్నారు. వాస్తవానికి మే నెలలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రతో సహా అనేక రాష్ట్రాల్లో టమాటా ధర కిలోకు రూ.15లోపే ఉంది.  ఇప్పుడు ఈ రేటు రూ.100 చేరువకు వెళ్తుండటం గమనార్హం. కాగా, కర్ణాటకలోని కోలార్ లో ఉన్న హోల్‌సేల్ APMC మార్కెట్‌లో కూడా ఢిల్లీ రేంజ్ లోనే టమాటా రేట్లు ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఇప్పటికే టమోటా రిటైల్ ధర కిలో రూ.100కి చేరుకుంది.

తెలంగాణలో.. 

తెలంగాణలో కూడా టమాట ధర సెంచరీ(Tomato-Rs100) దిశగా వెళ్తోంది. రాష్ట్రంలో టమాటా సాగు పెద్దగా లేకపోవడంతో ఏపీలోని చిత్తూరు, మదనపల్లె, మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ నుంచి ఇక్కడకు వ్యాపారులు తెచ్చుకుంటున్నారు. ఇటీవల కాలంలో  రవాణా ఛార్జీలు కూడా అధికం కావడంతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. మరికొద్దిరోజుల పాటు ధరలు ఇలాగే కొనసాగే అవకాశముందని అంటున్నారు. పంట దిగుబడి పెరిగితే ధరలు తగ్గే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు ధరలు పెగడంతో చాలామంది కూరల్లో టమాటా వాడటం మానేసే పరిస్థితి వచ్చింది.