Massive Fire: ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. 14 మంది మృతి

ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో భారీ అగ్నిప్రమాదం (Massive Fire) సంభవించింది. ఇక్కడి జోరాఫటక్ రోడ్డులో ఉన్న ఆశీర్వాద్ టవర్ మూడో అంతస్తులో మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్ పేలడమే అగ్నిప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

  • Written By:
  • Updated On - January 31, 2023 / 10:55 PM IST

ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో భారీ అగ్నిప్రమాదం (Massive Fire) సంభవించింది. ఇక్కడి జోరాఫటక్ రోడ్డులో ఉన్న ఆశీర్వాద్ టవర్ మూడో అంతస్తులో మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్ పేలడమే అగ్నిప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ధన్‌బాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 10 మంది మహిళలు, ముగ్గురు పిల్లలు, మరొకరు సహా 14 మంది మరణించినట్లు ధన్‌బాద్ డిప్యూటీ కమిషనర్ ధృవీకరించారు. అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ టవర్ సమీపంలో ఒక ఆసుపత్రి కూడా ఉంది. మంటలు చెలరేగడంతో అపార్ట్‌మెంట్‌లోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. డీఎస్పీ లా అండ్ ఆర్డర్ ప్రకారం.. ధన్‌బాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కొన్ని మరణాలు కూడా నమోదయ్యాయి. ఖచ్చితమైన సంఖ్య గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేము. రెస్క్యూ ఇంకా కొనసాగుతోందని తెలిపారు.

అయితే, ఆశీర్వాద్ ట్విన్ టవర్స్‌లోని రెండు, మూడు, నాలుగు, ఐదవ అంతస్తులకు మంటలు వ్యాపించాయని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. మంటలు చెలరేగిన ఇంట్లో పెళ్లి ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ భవనంలో దాదాపు 70 ఫ్లాట్లు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. సమాచారం ప్రకారం.. ఆశీర్వాద్ టవర్ 10 అంతస్తులు కలిగి ఉంది. మంటలను ఇంకా అదుపు చేయలేకపోయారు. 20కి పైగా అగ్నిమాపక శకటాలు అక్కడికక్కడే మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై ఉన్నాయి. భారీ సంఖ్యలో పోలీసు బలగాలు, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. చాలా అపార్ట్‌మెంట్ ఫ్లాట్లు ఖాళీ అయ్యాయి.

Also Read: Fake Currency : కోల్‌క‌తా భారీగా న‌కిలీ కరెన్సీ ప‌ట్టివేత‌.. పోలీసులు అదుపులో ఇద్ద‌రు నిందితులు

మరోవైపు.. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలోని టాప్సియాలో పాదరక్షల గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికక్కడే మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై ఉన్నారు. అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చినట్లు ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ అభిజిత్ పాండే తెలిపారు. భవనం మొదటి అంతస్తులో ఉన్న చెప్పుల దుకాణంలో మంటలు చెలరేగాయి.