Site icon HashtagU Telugu

Drugs : ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష!

Three Indians sentenced to death in Indonesia!

Three Indians sentenced to death in Indonesia!

Drugs: ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు డ్రగ్స్‌ అక్రమ రవాణా కేసులో మరణశిక్ష విధించే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి. 2024 జులైలో సింగపూర్‌ జెండా ఉన్న ఓడలో మాదకద్రవ్యాలను తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో సోదాలు నిర్వహించి 106 కేజీల మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నట్లు ఇండోనేషియా పోలీసులు పేర్కొన్నారు. వీటిని అక్రమంగా తరలిస్తున్న భారతీయులు రాజు ముత్తుకుమారన్‌, సెల్వదురై దినకరన్‌, గోవిందసామి విమలకంధన్‌ను నిర్భందంలో ఉంచినట్లు తెలిపారు.

Read Also: Miss World 2025: తెలంగాణలో మిస్‌ వరల్డ్‌ పోటీలు.. ఏ రోజు ఏం జరుగుతుంది ?

ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇదేవిధంగా గతంలో పలుమార్లు డ్రగ్స్‌ అక్రమ రవాణా కేసులో ఇండోనేషియా ప్రభుత్వం భారతీయులకు ఉరిశిక్ష వేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఓడ కెప్టెన్‌ విచారణకు హాజరవ్వాలని ఆదేశించగా.. అతడు గైర్హాజరయినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలో ముగ్గురు నిందితులతో పాటు.. ఈ కేసులో విచారణకు హాజరుకాని ఓడ కెప్టెన్‌కు మరణశిక్ష పడే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై ఏప్రిల్ 15న తీర్పు వెలువడనున్నట్లు సమాచారం. నిందితులు ముగ్గురు తమిళనాడుకు చెందిన వారుగా తెలుస్తోంది.

వీరి తరఫున భారతీయ న్యాయవాది జాన్ పాల్ కేసును వాదిస్తున్నారు. ఈయన కూడా తమిళనాడుకు చెందిన వ్యక్తి కావడం విశేషం. కెప్టెన్‌కు తెలియకుండా ఓడలో ఇంత పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు తరలించడం సాధ్యం కాని విషయమని.. కుట్రపన్ని అమాయకులైన ముగ్గురు వ్యక్తులను ఈ కేసులో ఇరికించారని ఆయన పేర్కొన్నారు. అసలైన నేరస్థులు తప్పించుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరినట్లు మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Read Also: BRS MLCs : శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన