Ramoji Rao: మీడియా మొఘల్ రామోజీరావు ఎన్నో విజయాలను అందుకున్నారు. అనేక రంగాల్లో విజయం సాధించారు. అందుకు ఆయన పాటించిన సూత్రాలే కారణం. ప్రతి వేకువలో ఉషోదయాన్ని, చీకటిని చీల్చి జగతిని జాగృతం చేసే బాలభానుని నునులేత ప్రకాశాన్ని తనివితీరా ఆస్వాదించడం నాకు అలవాటు. సూర్యుని ప్రస్థానం ఏ రోజుకారోజు నాలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంటుంది. ఏదో ఒకటి చేయాలన్న తపన, ఏదైనా సాధించినప్పుడు పొందే తృప్తి… వీటిని మించిన ప్రోత్సాహకాలు లేవు. క్రమశిక్షణ, కష్టపడటం, కలసి పనిచేయడం… నా విజయానికి మూలకారణాలు. కర్ర పెత్తనంతో భయపెట్టి సాధించగలిగేది ఏమీ లేదు. కోపంతో అదుపు తప్పే వ్యక్తి నాయకునిగా ఎదగలేడు.
సవాళ్లు లేని జీవితం నిస్సారం. ప్రతిదీ ప్రభుత్వమే చేయాలని దాదాపు ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. ఇది తమ అసమర్థతను పరోక్షంగా అంగీకరించడమే. తెల్లవారుజామున మూడు గంటలకే నా రోజు మొదలవుతుంది. పనిచేయడం మినహా ప్రత్యేకంగా అభిరుచుల కోసం ఎలాంటి సమయమూ మిగలదు. నాకు కావాల్సిన సంతృప్తిని నా పత్రికలు, ఛానళ్లు, కార్యకలాపాలే అందిస్తాయి. మనందరిలోనూ అపరిమితమైన శక్తి ఉంటుంది. దాన్ని తెలుసుకోవడంలోనే అంతా ఉంది. మనకేం కావాలో ఏం వద్దో మన శరీరమే చెబుతుంది. గ్రహించగలిగే శక్తి ఉంటే, ఆ ప్రకారం నడుచుకుంటే అంతా సవ్యంగానే ఉంటుంది. ఎంత చెయ్యాలన్న దానికి పరిమితులు, కొలమానాలు లేవు. చెయ్యాలన్న చిత్తశుద్ధి, చేసి చూపాలన్న దృఢ దీక్ష మాత్రమే కావలసింది. సంప్రదాయం పురోభివృద్ధికి బాటలు పరవాలి. అంతేగాని మనల్ని నాశనం చేసేది కాకూడదు.