Bathukammakunta: అంబర్‌పేట్‌లోని బతుకమ్మకుంటను నేడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండు నెలల్లో బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం తీసుకొస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. బతుకమ్మకుంట ప్రాంతంలో ఉన్న ఇండ్ల కూల్చివేతలు ఉండవని స్పష్టం చేశారు. కేవలం బతుకమ్మకుంటను పునరుద్దరిస్తామని తెలిపారు. స్థానిక ప్రజల్లో కూల్చివేతలు ఉంటాయనే అపోహ ఉందని.. ఆ అపోహలు తొలగించేందుకే బతుకమ్మకుంటకు వచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతమున్న ఐదెకరాల విస్తీర్ణంలోనే పునరుద్దణ చేస్తామన్నారు. బతుకమ్మకుంటలోకి వరద నీరు వచ్చే మార్గాలపై రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో చర్చిస్తామన్నారు.
బతుకమ్మ కుంటలో మొలిచిన చెట్లను జెసిబితో తో తొలగిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఉన్న ఏ ఒక్క నిర్మాణాన్ని కూడా కూల్చమని హామీ ఇచ్చిచారు. ఇప్పుడు ఉన్న కుంటను అభివృద్ధి చేసి చుట్టూ పార్క్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. హైడ్రా నోటీసులు ఇచ్చే అధికారం ఉందని, హైడ్రా నోటీసులు ఆక్రమణదారులకు వెళ్తూనే ఉంటాయన్నారు. నాగారంలో రోడ్డు కబ్జా చేసి కట్టిన నిర్మాణాలను ఈరోజు కూల్చేశామన్నారు. ఐదు కాలనీలకు వెళ్ళే రొడ్డును ఆక్రమించారని క్లారిటీ ఇచ్చారు. తమకు స్థానికులు కంప్లెయింట్ చేయడంతో సర్వే చేశామన్నారు. 15 ఏళ్లుగా కబ్జాలో ఉన్న నిర్మాణాలు తొలగించామని రంగనాథ్ పేర్కొన్నారు.
ఇకపోతే.. మళ్లీ నగరంలో హైడ్రా కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ఈరోజు నాగారంలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. రాంపల్లి సమీపంలో రాజ్ సుఖ్‌నగర్ కాలనీలో మెయిన్ రోడ్డును ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలు హైడ్రా కూల్చివేసింది. హైడ్రా రెండు బృందాలుగా ఏర్పడి కూల్చివేతలు చేపట్టింది.
Read Also: Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లు.. తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్