Site icon HashtagU Telugu

PRC: పీఆర్సీ చిచ్చు.. జేఏసీ నుండి త‌ప్పుకున్న‌ రెండు ప్రధాన సంఘాలు..!

Prc

Prc

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పీఆర్సీ(PRC) ఉద్యమ మగింపు అంశం, ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టింది. తాజాగా ఏపీ ప్ర‌భుత్వంతో పీఆర్సీ సాధన సమితి జరిపిన చర్చల్లో సాధించిందేమీ లేదని ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ క్ర‌మంలో ఉద్యోగుల జేఏసీలో చీలిక రావ‌డంతో, ఉపాధ్యాయ సంఘాలు త‌మ నిర‌స‌న‌ను ప్రారంభించాయి. కొత్త పీఆర్సీతో తమకు అన్యాయం జరుగుతుందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అలాగే హెచ్ఆర్ఏ శ్లాబుల వల్ల కూడా తాము నష్టపోతున్నామని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నారు. ఈ నేప‌ధ్యంలో ఉపాధ్యాయులు త‌మ విధుల‌కు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.

ఇక మ‌రోవైపు పీఆర్సీ సాధన సమితిలో భాగంగా ఉన్న ఏపీటీఎఫ్ ఇప్పటికే జేఏసీ నుంచి పక్కకు తప్పుకోగా, తాజాగా మరో ప్రధాన సంఘమైన యూటీఎఫ్ కూడా జేఏసీ నుంచి తప్పుకోనుంద‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో యూటీఎఫ్ కీలక సమావేశం జరిగే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. మ‌రో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే ఉపాధ్యాయ సంఘాలు, కాంటాక్ట్ ఉద్యోగులతో కలసి కొత్త జేఏసీని ఏర్పాటు చేయాలన్న ప్రయత్నంలో ఉన్నారని, ఈ క్ర‌మంలో కొత్త స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసి ఉద్యమ కార్యాచరణను సిద్దం చేయనున్నాయని స‌మాచారం. ఇక డిమాండ్లు పరిష్కారం కాకుండానే ఉద్యమాన్ని ముగించడంతో, ఉద్యోగ సంఘాల నేత‌ల‌పై, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉగ్యోగులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.