తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ ఎండలు మండుతున్నాయి. ఇంకా చెప్పాలంటే…పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. సాధారణం కంటే 6-7 డిగ్రీల వరకు అదనంగా నమోదవుతున్నాయి. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు కూడా మొదలయ్యాయి. ముఖ్యంగా సింగరేణి బెల్ట్ లో ఈ వడగాలులు అధికంగా వీస్తున్నాయి. ఇకపోతే.. ఇవాళ, రేపు వడగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. నల్గొండలో బుధవారం సాధారణం కంటే 5 డిగ్రీలు అధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత పదేళ్లలో నల్గొండలో మార్చి నెలలో నమోదైన అత్యధిక పగటి ఉష్ణోగ్రత ఇదే. అంతకుముందు 2016 లో మార్చి 23న 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
అలానే ఆదిలాబాద్, రామగుండం, నిజామాబాద్, పెద్దపల్లి, భద్రాచలం, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం తదితర ప్రాంతాల్లోనూ బుధవారం 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని… కాబట్టి ప్రజలు మధ్యాహ్నం పూట అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు. బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాగా, గాలిలో తేమ శాతం తగ్గిపోవడంతో వాతావరణం పొడిగా మారి ఉక్కపోత ఎక్కువైనట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.