Hydra : హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నగరంలోని బుద్ధ భవన్ బీ-బ్లాక్‌లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. హైడ్రాకు విస్తృత అధికారాలను కల్పిస్తూ ఇప్పటికే ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. త్వరలో ఇక్కడ పోలీస్ స్టేషన్ ఏర్పాటు కానుంది. కాగా, హైడ్రాకు కార్యాలయ నిర్వహణ, వాహనాల కొనుగోలుకు కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రూ. 50 కోట్ల నిధులు మంజూరు చేసింది.
ఇక, హైడ్రాను ఏ చట్టం ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేసిందనే ప్రశ్నలు తలెత్తడంతో.. ఏకంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ – జీహెచ్‌ఎంసీ చట్టం 1955ను సవరించింది. హైదరాబాద్ నగరంలోని జలాశయాలు, ఇతర ఆస్తులను కాపాడేందుకు అధికారిని లేదా సంస్థను ఏర్పాటు చేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కట్టబెడుతూ.. జీహెచ్ఎంసీ చట్టంలో కొత్తగా 374 బి సెక్షన్‌ను చేర్చింది. హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాల తొలగింపు.. జలాశయాలు, ఇతర ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రా (హైదరాబాద్ విపత్తు స్పందన ఆస్తుల పర్యవేక్షణ పరిరక్షణ ఏజెన్సీ)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఇకపోతే..హైడ్రా కమిషనర్ రంగనాథ్ నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేత తప్పదని మరోసారి హెచ్చరించారు. జూబ్లీహిల్స్‌లోని నందగిరి హిల్స్, హుడాఎన్ క్లేవ్ కాలనీతో పాటు గురుబ్రహ్మనగర్ బస్తీల్లో హైడ్రా సిబ్బందితో కలిసి ఈరోజు ఏవీ రంగనాథ్ 2 గంటలపాటు పర్యటించారు. ఆక్రమణదారులపై కేసులు నమోదు చేసేందుకు హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు అంతకుముందు తెలిపారు. 2011లో డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని కొందరు ఆక్రమిస్తున్నారని స్థానికులు రంగనాథ్‌కు మొరపెట్టుకున్నారు. ఆక్రమణకు గురైన ఎకరా 25 గుంటల ప్రభుత్వ భూమిపై ఆరా తీశారు. దీనిపై స్పందించిన హైడ్రా కమిషనర్.. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం కేటాయించిన స్థలంలో వారికి ఇళ్లు కట్టించే బాధ్యతను స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. మొదట ఎకరం 25 గుంటలను ముందుగా రక్షిస్తామని అన్నారు.