CM Revanth Reddy: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలు విడిచిన పోలీసు అమరవీరులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా, ముఖ్యమంత్రి అమరులైన పోలీసుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, వారి త్యాగాలను ప్రశంసించారు. గోషామహల్ వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన సీఎం, అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ప్రత్యేక సమావేశంలో ప్రసంగిస్తూ, పోలీసులు తమ ప్రాణాలను సమర్పించి, త్యాగం, సేవలకు ప్రతీకగా నిలిచారని కొనియాడారు. వారు కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో , సమాజానికి తోడ్పాటు అందించడంలో ఎప్పుడూ ముందుంటారని, వారి సేవలు మరువలేనివని చెప్పారు.
Nara Lokesh : కేంద్రమంత్రి అమిత్ షాతో నారా లోకేశ్ భేటీ
అనేక పోలీసు అధికారులు, కేఎస్ వ్యాస్, పరదేశి నాయుడు, ఉమేష్ చంద్ర వంటి వారు చేసిన త్యాగాలను ఆయన చిరస్మరణీయంగా గుర్తించారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పనలో శాంతిభద్రతలు కీలకమని, అలాంటి శాంతిభద్రతలను పోలీసు వ్యవస్థ కాపాడుతోందని అభినందించారు. సైబర్ క్రైమ్ ఛేదనలో తెలంగాణ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మెచ్చుకుందని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలో క్రైమ్ రేటును నియంత్రించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని, గంజాయి, డ్రగ్స్ వంటి సమకాలీన సమస్యలను కట్టడి చేయడానికి టీజీ నార్కోటిక్ బ్యూరోని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
అనంతరం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులకు కీలక సూచనలిచ్చారు. నేరాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించడానికి పోలీసులు సిద్ధంగా ఉండాలని, పండుగల నిర్వహణలో శాంతిభద్రతలను కాపాడడంలో అలసత్వం వహించవద్దని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి, ప్రజల రక్షణకు పోలీసులు ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారో పునరుద్ఘాటించారు. వారిని ప్రోత్సహిస్తూ, ప్రజల భద్రత కొరకు పోలీసులు ఎంతో శ్రమిస్తున్నారు అన్న విషయాన్ని వివరించారు.
అంతేకాకుండా, పోలీసుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవడం, అమరవీరులకు ప్రభుత్వం నుండి అందించే నష్టపరిహారం, ఉద్యోగాలు, ఉపాధి కల్పనలో పోలీసుల పాత్ర గురించి కూడా స్పష్టంగా వివరించారు. ఈ సందర్భంగా, ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం అందించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు, అలాగే పోలీసుల బాధ్యతలను, చట్టాన్ని కాపాడడంలో వారు ఏ విధంగా సహకరించాలో కూడా తెలిపారు.