Site icon HashtagU Telugu

Bojjala Gopala Krishna: టీడీపీ నేత బొజ్జల ఇకలేరు!

Bojjala

Bojjala

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి(73) 1989 నుంచి వరుసగా మూడు సార్లు శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి గెలుపొందారు, 2004 లో ఓటమి పాలైనా.. తిరిగి 2009,2014 ఎన్నికల్లో విజయం సాధించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన బొజ్జల.. 2003 లో అలిపిరి వద్ద అప్పటి సీఎం చంద్రబాబుపై జరిగిన బాంబు దాడి ఘటనలో తృటిలో స్వల్ప గాయాలతో తప్పించుకొన్నారు. బొజ్జల మరణం పట్ల పలువురు టీడీపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

బొజ్జల మృతి పట్ల గవర్నర్ సంతాపం

మాజీ మంత్రి, సీనియర్‌ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి (73) మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసారు. హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో శనివారం ఆయన మరణించగా, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్రీకాళహస్తి నుంచి ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బొజ్జల కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్ధిస్తున్నానని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని గవర్నర్ హరిచందన్ పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.