TCS Dress Code : ఐటీ దిగ్గజం టీసీఎస్ (TCS) కీలక ప్రకటన చేసింది. వర్క్ ఫ్రం హోంను ఆపేశామని, ఇక నుంచి 6 లక్షల మందికిపైగా ఉద్యోగులంతా ఆఫీసులకు రావాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇప్పటివరకు ఇళ్ల నుంచి పనిచేసే క్రమంలో ఉద్యోగులు డ్రెస్ కోడ్ పాటించలేదని.. ఇక నుంచి ఆఫీసుకు సరైన డ్రెస్ కోడ్ తో రావాలని టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రీసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ నిర్దేశించారు. డ్రెస్ కోడ్ విషయానికి వస్తే.. అసోసియేట్స్ అంతా బిజినెస్ క్యాజువల్స్ ధరించాలన్నారు. పురుషులు.. ఫుల్ స్లీవ్డ్ షర్టులతో టక్ ఇన్ చేసుకోవాలని కోరారు. మహిళలు చీర లేదా మోకాళ్ల వరకు ఉండే కుర్తాలు ధరించాలన్నారు. సోమవారం నుంచి గురువారం వరకు డ్రెస్ కోడ్ ను ఈవిధంగా పాటించాల్సిందే అని మిలింద్ లక్కడ్ చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
సెమినార్స్, సమిట్స్, క్లయింట్ విజిట్స్ సమయంలో బిజినెస్ ఫార్మల్స్ ధరించాలన్నారు. హాఫ్ స్లీవ్డ్ షర్టులు, టర్టిల్‌నెస్, ఖాకీ చొక్కాలు, చినో, కుర్తీ, సల్వార్ (మహిళలు) వంటివి ధరించడానికి శుక్రవారం మాత్రమే అనుమతిస్తామన్నారు. గత రెండేళ్లలో టీసీఎస్ లో కొత్తగా చాలా మంది చేరారని.. వారు ఇప్పుడు ఆఫీసులకు వచ్చి టీసీఎస్ పద్ధతులను నేర్చుకోవాలని కోరారు. ఆఫీసులకు వచ్చి పనిచేయడం వల్లే ఉద్యోగుల మధ్య సమన్వయం ఉంటుందని.. బిజినెస్ చక్కగా జరుగుతుందన్నారు. ఈ మేరకు ఉద్యోగులకు టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రీసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ మెయిల్ (TCS Dress Code) పంపారు.