Manipur Viral Video Case : కేంద్రంపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆ వీడియో బయటకు వచ్చేంతవరకు ఏం చేశారని ప్రశ్న

Manipur Viral Video Case : మణిపూర్ లో మే 4న ఇద్దరు మహిళలను అల్లరి మూకలు నగ్నంగా ఊరేగించి, రేప్ చేసిన అమానుష ఘటనకు సంబంధించి కేంద్రంపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది.

  • Written By:
  • Publish Date - July 31, 2023 / 05:55 PM IST

Manipur Viral Video Case : మణిపూర్ లో మే 4న ఇద్దరు మహిళలను అల్లరి మూకలు నగ్నంగా ఊరేగించి, రేప్ చేసిన అమానుష ఘటనకు సంబంధించి కేంద్రంపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ఆ ఘటనతో ముడిపడిన వైరల్‌ వీడియో కేసుకు సంబంధించిన పిటిషన్‌ పై సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని  సుప్రీం కోర్టు బెంచ్ సోమవారం  విచారణ జరిపింది. ఈసందర్భంగా మణిపూర్ పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. “ఆ వీడియో బయటకు వచ్చే వరకు ఏం చేస్తున్నారు” అని సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని  సుప్రీం కోర్టు బెంచ్ కేంద్ర ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు వేసింది. “మే 4న ఘటన జరిగితే మే 18న ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేశారు ?  మే 4 నుంచి మే 18 వరకు పోలీసులు ఏం చేస్తున్నారు? ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి రెండు వారాల సమయం ఎందుకు పట్టింది ?  వీడియో బయటకు వచ్చేంతవరకు ఏం చేస్తున్నారు ? ఇలాంటి ఘటనలు ఇంకా చాలానే జరిగాయి. పోలీసులు ఏం చేస్తున్నారు?’’ అని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది.

Also read : Rajnikanth: నా జీవితంలో చేసిన అతిపెద్ద పొరపాటు అదే: రజనీకాంత్

దీనికి కేంద్ర ప్రభుత్వం తరఫున బదులిచ్చిన  సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా.. “కేంద్ర  ప్రభుత్వం ఏమీ దాచిపెట్టడం లేదు”(Manipur Viral Video Case) అన్నారు.   ఈ కేసులో సీబీఐ విచార‌ణ‌ను బాధిత మ‌హిళ‌లు వ్య‌తిరేకిస్తున్నారని.. వేరే ఏ కోర్టుకూ ఈ కేసును బ‌దిలీ చేయ‌వద్దంటున్నారని సీనియ‌ర్ న్యాయ‌వాది క‌పిల్ సిబ‌ల్ కోర్టుకు తెలిపారు. కేంద్ర  ప్ర‌భుత్వం తరఫున సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా స్పందిస్తూ.. అస్సాం కు ఈ కేసును బదిలీ చేయమని ప్రభుత్వం కోరలేదని స్పష్టం చేశారు. అయితే విచారణ మణిపూర్ వెలుపల జరిగితే బాగుంటుందని మాత్రమే కోరామన్నారు. దర్యాప్తును సుప్రీంకోర్టు పర్యవేక్షించవచ్చని పేర్కొన్నారు. మణిపూర్ లో హింస మొదలైనప్పటి నుంచి ఇప్పటివ‌ర‌కు 595 ఎఫ్ఐఆర్‌లు న‌మోదయ్యాయని సీనియ‌ర్ న్యాయ‌వాది ఇందిరా జైసింగ్ తెలిపారు. కేసు విచారణ విషయమై హైప‌వ‌ర్ మ‌హిళా క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని ఆమె అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. వాదనలు విన్న అనంతరం విచారణను రేపు మధ్యాహ్నానికి సుప్రీం కోర్టు బెంచ్ వాయిదా వేసింది.