Site icon HashtagU Telugu

Viveka Murder case : వివేకా హత్య కేసు.. హైకోర్టులో సునీత పిటిషన్‌

Sunitha files petition in High Court in Viveka murder case

Sunitha files petition in High Court in Viveka murder case

Viveka Murder case : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విచారణపై శుక్రవారం తెలంగాణ హైకోర్టు లో పిటిషన్ దాఖలైంది. వివేకా కుమార్తె సునీత ఈ పిటిషన్ వేశారు. ఇందులో ఆమె సీబీఐని ప్రతివాదిగా చేర్చారు. సీబీఐ కోర్టులో తన తండ్రి హత్య కేసును రోజువారీగా విచారించేలా ఆదేశించాలని పిటిషన్‌లో ఆమె కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం విచారణ చేపట్టింది. హైకోర్టులో విచారణ సందర్భంగా సునీత తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆరేళ్ళ క్రితం హత్య జరగగా.. ఇప్పటివరకు ఈ కేసులో ఎలాంటి చెప్పుకోదగిన పురోగతి లేదన్నారు.

Read Also: Terrorism : కశ్మీర్‌లో రాళ్లురువ్వే రోజులు పోయాయి: అమిత్‌ షా

2019 మార్చ్ 14 అర్థరాత్రి ఈ హత్య జరిగిందని.. అనంతరం వైసీపీ ప్రభుత్వం వేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం నుంచి విచారణ సీబీఐకి మారింది గాని, ఎలాంటి ఫలితం లేదన్నారు. ఇంకా సీబీఐ కోర్టులోనే విచారణ కొనసాగుతోందని.. దీన్ని ఆరు నెలల్లోగా ముగించేలా కోర్టును ఆదేశించాలని హైకోర్టును కోరారు. సీబీఐ అధికారులు ఇప్పటికే కొన్ని పత్రాలకు సంబంధించి హార్డ్‌ డిస్క్‌లో ప్రతివాదుల తరఫు న్యాయవాదులకు ఇచ్చారనీ.. అయితే, హార్డ్‌డిస్క్‌లో ఉన్న కాపీలు ఓపెన్‌ కావడంలేదు గనక నేరుగా ప్రింటింగ్‌ ప్రతులు కావాలని వారు కోరిన విషయాన్ని గుర్తు చేశారు.

అయితే, లక్షల సంఖ్యలో పేజీలు ఉండటంతో ప్రింటింగ్‌కాపీలు ఇవ్వడం కుదరదు గనక హార్డ్‌ డిస్క్‌లను ఓపెన్‌ చేయాలని సీబీఐ అధికారులు చెబుతుండటంతో.. దాదాపు 15 నెలలుగా విచారణ ముందుకు సాగడంలేదని సునీత న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇక, సీబీఐ అధికారులతో పాటు సునీత ప్రధానంగా తన తండ్రి హత్య కేసులో నిందితులుగా ఉన్నవారందరినీ ప్రతివాదులుగా చేర్చారు. ఈ అంశంపై విచారణ జరిపిన ప్రత్యేక ధర్మాసనం సీబీఐతో పాటు ఈ కేసులో నిందితులందరికీ నోటీసులు వ్యక్తిగతంగా నోటీసులు ఇచ్చేందుకు సునీత న్యాయవాదికి అనుమతి ఇచ్చింది. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు 4 వారాలకు వాయిదా వేసింది.

Read Also: Great place to work : సర్టిఫైడ్ సంస్థగా ఎడ్యుకేషన్ ఇండియా గుర్తింపు