Kanipakam Temple: జింక చర్మంతో పట్టుబడ్డ కాణిపాకం అర్చకుడు.. ఈవో చర్యలు

కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం (Kanipakam Temple)లో అధికారులు సోదాలు నిర్వహించగా పూజారి నివాసంలో జింక చర్మం కనిపించడంతో షాక్‌కు గురయ్యారు.

  • Written By:
  • Publish Date - April 9, 2023 / 09:05 AM IST

కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం (Kanipakam Temple)లో అధికారులు సోదాలు నిర్వహించగా పూజారి నివాసంలో జింక చర్మం కనిపించడంతో షాక్‌కు గురయ్యారు. ఆలయ ప్రసాదాలు తయారు చేసే పోటు, గోదాం, అన్నదాన సత్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో శనివారం ఆలయ ఈఓ వెంకటేశుల ఆధ్వర్యంలో సిబ్బంది నివాసాల్లో సోదాలు నిర్వహించారు. వరసిద్ధి వినాయకస్వామి అనుబంధ ఆలయమైన వరదరాజులస్వామి ఆలయ పూజారి కృష్ణమోహన్ నివాసంలో జింక చర్మం లభ్యమైంది. ఈ విషయాన్ని ఈవో వెంకటేశులు అటవీశాఖ అధికారులకు తెలియజేయడంతో వారు అక్కడికి చేరుకున్నారు.

డీఎఫ్‌వో చైతన్యకుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు జింక చర్మాన్ని స్వాధీనం చేసుకున్న అటవీశాఖ అధికారులు కృష్ణమోహన్‌ను అదుపులోకి తీసుకున్నారు. జింక చర్మాన్ని ఓ వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు విచారణలో కృష్ణమోహన్ వెల్లడించారని, దానిని విక్రయించిన నిందితుల కోసం గాలిస్తున్నామని ఎఫ్‌ఆర్‌వో బాలకృష్ణారెడ్డి తెలిపారు. శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయంలోని అన్నసత్రం, గోదాము, పోటులో పనిచేస్తున్న సిబ్బందిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆలయ భద్రతా సిబ్బంది, ఈవో ఎ.వెంకటేశు శనివారం తెల్లవారుజామున వారి ఇళ్లపై దాడి చేశారు.

Also Read: Farooq Abdullah : మొఘల్ పాఠ్యాంశాల తొలగింపును ఖండించిన ఫరూక్ అబ్దుల్లా 

నలుగురు వంట మనుషుల ఇళ్లలో పెద్దఎత్తున బియ్యం, ఇతర వస్తువులు బస్తాలు బయటపడ్డాయి. చిన్నకాంపల్లె, గోడౌన్, పోటుకు చెందిన అన్నదాన సత్రంలో పనిచేస్తున్న మహిళ ఇళ్లలో బియ్యం, పంచదార, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. రోజూ 2,500 మందికి ఆహారం అందించడానికి అవసరమైన వస్తువులు, సేవలను గోదాము నుండి ముందు రోజు తీసుకుంటారు. వీటిలో కొందరూ వస్తువులను స్వస్థలాలకు తరలిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈవో అన్నదాన భవనం వద్ద రహస్యంగా సరుకులు తీసుకువెళుతున్న ఓ బైక్ ను వెంబడించి పట్టుకున్నారు. ఈ ఘటనతో ఆలయ సిబ్బంది అవకతవకలకు పాల్పడుతున్నట్లు నిర్దారణ కావడంతో ఈవో వెంకటేశ్ చర్యలు చేపట్టారు.

అర్చకులతో సహా ఆలయలంలో పని చేసేవారి నివాసాల్లో సోదాలు నిర్వహించి రూ.1.30 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు సిబ్బంది ఇళ్లలో సరుకులు స్వాధీనం చేసుకున్నట్లు ఈవో వెంకటేశు తెలిపారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.