Spurious Liquor: తమిళనాడులో కల్తీ మద్యం తాగి 10 మంది మృతి చెందగా పలువురు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రి పాలయ్యారు. అయితే రెండు వేర్వేరు ఘటనలో ఈ విషాదం చోటు చేసుకుంది.
తమిళనాడులోని విల్లుపురం, చెంగల్‌పట్టు జిల్లాల్లో కల్తీ మద్యం సేవించి ముగ్గురు మహిళలు సహా 10 మంది మరణించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. చెంగల్‌పట్టు జిల్లా మదురాంతగాంలో శుక్రవారం ఇద్దరు వ్యక్తులు, ఆదివారం దంపతులు కల్తీ మద్యం సేవించి మృతి చెందినట్లు స్థానిక పోలీసులు సమాచారం ఇచ్చారు. ఈ సంఘటనలో 12 మంది చికిత్స పొందుతున్నారు. ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎన్ కన్నన్ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మొత్తం 10 మంది బాధితులు ఇథనాల్-మిథనాల్ పదార్థాలు కలిపిన ఆల్కహాల్ సేవించారని చెప్పారు.
తమిళనాడులోని ఉత్తర ప్రాంతంలో కల్తీ మద్యం కారణంగా రెండు వేర్వేరు సంఘటనలు చోటుచేసుకున్నాయి, మరక్కానం సమీపంలోని విల్లుపురం జిల్లా ఎక్కియార్‌కుప్పం గ్రామంలో, వాంతులు, కళ్లలో మంటలు మరియు కళ్లు తిరగడం వంటి ఫిర్యాదులతో 6 మందిని నిన్న ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఈ రెండు సంఘటనలకు ఒకటికి ఒకటి సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. అయితే నిజనిజాలు తెలియాలంటే విచారణ అవసరమని, ఆ తర్వాతే పూర్తి వివరాలు తెలియజేస్తామని అన్నారు.
కాగా.. సంబంధిత అధికారులపై క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకున్నట్లు తెలిపారు. విలుపురం మరక్కాణంలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్ చేశారు. అదేవిధంగా చెంగల్‌పట్టు ఘటనకు సంబంధించి ఒక ఇన్‌స్పెక్టర్‌తో పాటు ఇద్దరు సబ్‌ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్ చేశారు.
Read More: Joinings in BRS: బీఆర్ఎస్ పార్టీలోకి చేరికల పర్వం!