Railway Jobs 2025 : భారీగా రైల్వే ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. ఏకంగా 32,438 లెవల్-1 కేటగిరీ ఉద్యోగాలను రిక్రూట్ చేసేందుకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పదో తరగతి/ఐటీఐ లేదా తత్సమానం/ ఎన్‌సీవీటీ జారీచేసిన నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ (ఎన్‌ఏసీ) ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. దేశంలోని వివిధ రైల్వే జోన్ల పరిధిలో ఉన్న ఆర్‌ఆర్‌బీలు వేర్వేరుగా జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేశాయి. అయితే అభ్యర్థులకు పరీక్ష మాత్రం ఉమ్మడిగానే నిర్వహిస్తారు. అందుకే అభ్యర్థులు ఏదో ఒక ఆర్‌ఆర్‌బీకి(Railway Jobs 2025) మాత్రమే అప్లై చేయాలి. పరీక్షను తెలుగు మీడియాంలో కూడా రాసుకోవచ్చు.
- అర్హతలు, ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఫిబ్రవరి 22. అప్లై చేయాల్సిన వెబ్‌సైట్ : https : //www. rrbapply.gov.in/#/auth/landing.
- మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ట్రాన్స్‌జెండర్, ఈబీసీలకు దరఖాస్తు ఫీజు రూ.250. ఇతర వర్గాల వారికి ఫీజు రూ.500. పరీక్షకు హాజరయ్యే వారికి బ్యాంకు ఛార్జీలను మినహాయించి, మిగిలిన ఫీజును వెనక్కి ఇస్తారు.
- 2025 జనవరి 1 నాటికి 18-36 ఏళ్లలోపు వారు అప్లై చేయొచ్చు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్)కు మూడేళ్లు, దివ్యాంగులకు కేటగిరీ ప్రకారం పది నుంచి పదిహేనేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
Also Read :Weekly Horoscope: జనవరి 27 టు ఫిబ్రవరి 2 రాశిఫలాలు.. ఆ రాశుల వారి జీవితంలో కుదుపులు
ఉద్యోగ హోదాలు
మొత్తం 14 విభాగాల్లో 32,438 లెవల్-1 కేటగిరీ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ జాబ్స్ ఎస్‌అండ్‌టీ, మెకానికల్, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ట్రాఫిక్ విభాగాల్లో ఉంటాయి. ఎంపికయ్యే వారికి అసిస్టెంట్స్, ట్రాక్‌మెన్, పాయింట్స్‌మెన్ వంటి హోదాలను కేటాయిస్తారు.
ఎంపిక ప్రక్రియ
పరీక్ష తేదీలను తదుపరిగా ప్రకటిస్తారు. ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో పరీక్షను నిర్వహిస్తారు. వంద మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు. తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కును తగ్గిస్తారు. వంద ప్రశ్నలు వస్తాయి. వ్యవధి 90 నిమిషాలు. జనరల్ సైన్స్ 25, మ్యాథమెటిక్స్ 25, జనరల్ ఇంటలిజెన్స్ అండ్ రీజనింగ్ 30, జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్‌లో 20 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి. అన్ రిజర్వ్‌డ్, ఈడబ్ల్యుఎస్‌లు 40, ఓబీసీ(ఎన్‌సీఎల్), ఎస్సీ, ఎస్టీలు 30 శాతం మార్కులు పొందితే పరీక్షలో అర్హత సాధిస్తారు. ఇలా అర్హులైనవారి జాబితా నుంచి మార్కుల మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం కొందరిని ఎంపిక చేసి, దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు.చివరగా ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. మెడికల్ టెస్టుల ఫలితాల తర్వాతే నియామక ఉత్తర్వులను జారీ చేస్తారు.
శాలరీ
లెవల్-1 కేటగిరీ రైల్వే ఉద్యోగాలకు ఎంపికయ్యే వారికి మొదటి నెల నుంచే రూ.35వేల దాకా శాలరీ ఇస్తారు. మూల వేతనం రూ.18,000, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులతో కలుపుకొని నెలవారీ శాలరీ రూ.35వేలు అవుతుంది. ఉద్యోగ కాలం, విద్యార్హతలు, అంతర్గత పరీక్షల ద్వారా పదోన్నతులను పొందొచ్చు.