Poll Day – Double Murder : తనకు వ్యతిరేకంగా ఎన్నికల్లో ఓటు వేశారనే కోపంతో ఇద్దరు అమాయక ఓటర్లను కాల్చి చంపిన ఆర్జేడీ పార్టీ మాజీ ఎంపీ ప్రభునాథ్ సింగ్ కు సుప్రీంకోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. 1995 సంవత్సరంలో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభునాథ్ బీజేపీ నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. తనకు ఓటు వేయలేదనే అక్కసుతో.. ఆ టైంలో సరణ్ జిల్లాలోని చాప్రాలో ఇద్దరు వ్యక్తులపై తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. అయితే ఈ ఘటనలో ప్రభునాథ్ ను నిర్దోషిగా ప్రకటిస్తూ 2008లో లోకల్ కోర్టు, 2012లో పాట్నా హైకోర్టు తీర్పులు ఇచ్చాయి. అయితే ఈ తీర్పులపై న్యాయపోరాటం కొనసాగిస్తూ చివరకు సుప్రీంకోర్టు తలుపుతట్టిన బాధిత కుటుంబానికి ఎట్టకేలకు న్యాయం దక్కింది. ప్రభునాథ్ ను దోషిగా తేల్చిన దేశ సర్వోన్నత న్యాయస్థానం.. గతంలో పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ఈమేరకు సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది.
Also read : Sriharikota: రాకెట్ ప్రయోగాలు శ్రీహరికోట నుండే ఎందుకు జరుగుతున్నాయి..? అక్కడి నుంచే రాకెట్లు ఎందుకు పంపిస్తారు..?
దీంతో ఆ ఘటన జరిగిన 28 ఏళ్ల తర్వాత అత్యంత ఆలస్యంగా ప్రభునాథ్ కు శిక్ష ఖరారైంది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున నష్టపరిహారం అందించాలని బీహార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. కాగా, 1995లో జరిగిన ఎన్నికల్లో ప్రభునాథ్‌పై గెలిచిన ఎమ్మెల్యే అశోక్ సింగ్ కూడా హత్యకు గురయ్యారు. ఆ కేసులోనూ ప్రభునాథ్ దోషిగా తేలడంతో 2017లో హజారీబాఘ్ కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. ఇక, గతంలోకి వెళితే తొలుత బీజేపీ ఆ తర్వాత జనతాదళ్, జనతాదళ్ యునైటెడ్ పార్టీల్లోకి వెళ్లిన ప్రభునాథ్ ప్రస్తుతం ఆర్జేడీలో ఉన్నారు. ఇంతపెద్ద నేర చరిత్ర కలిగిన ఆయన రెండు సార్లు ఎమ్మెల్యే, నాలుగు సార్లు ఎంపీగా (Poll Day – Double Murder) గెలవడం గమనార్హం.